రెక్కాడితే కానీ.. డొక్కాడని కుటుంబాలు వారివి. దూరప్రాంతానికి కూలి పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఊహించని ప్రమాదం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతిచెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. 44వ నంబరు జాతీయ రహదారిపై ఈ విషాదం చోటుచేసుకుంది.
బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద, పెద్దకడబూరు మండలం రంగాపురం గ్రామాలకు చెందిన 30 మంది కూలీలు.. పిల్లలతోసహా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో నెల రోజులపాటు పత్తి పొలాల్లో పనులు చేయడానికి శనివారం రాత్రి ట్రాక్టర్‌లో బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయానికి ట్రాక్టర్ తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియంకొండ వద్దకు చేరిన ట్రాక్టర్.. అదుపు తప్పింది.
రోడ్డుపై మలుపు తిప్పే ప్రయత్నంలో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో.. ఉరుకుందకు చెందిన దీపిక(19), రంగాపురానికి చెందిన నాగవేణి(25) మృతిచెందారు. సునీల్‌కుమార్, సుజాత, ప్రభావతి, కుబేరా, రుబేనా, మేరీ, వీరన్న గాయపడ్డారు. వీరన్న పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి