నంద్యాలలో సలాం కుటుంబానిది ప్రభుత్వ హత్యేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ఘటనకు సంబంధించి అసలు కారకులపై చర్యలు తీసుకోకుండా కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీఐ, కానిస్టేబుల్ను అరెస్ట్ చేసిన 24 గంటలలోపే విడుదల చేసి వారిని కాపాడేయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఉజ్వల భవిష్యత్ ఉన్న ఇద్దరు చిన్నారులు కూడా బలయ్యారని ధ్వజమెత్తారు.
అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బందిపెడుతూ, నలుగురు మైనారిటీలు ప్రాణాలు పోవడానికి కారకులైన వారికి వెంటనే బెయిల్ మంజూరు చేయించారని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజా సమస్యలపై పోస్టులు పెట్టినందుకు నెలల తరబడి జైలులో పెట్టి వేధించారని దుయ్యబట్టారు. ముస్లిం సోదరులను రాష్ట్రంలో ప్రాణాలతో బ్రతకనివ్వరా అంటూ మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ వారి తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కుటుంబం ఆత్మహత్య ఘటన.. దర్యాప్తు వేగవంతం