వైకాపా ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఇసుక కొరత వల్ల ఉపాధి లేక ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తూ కోడుమూరులో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏపీలో తప్పా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంటిదగ్గర 144 సెక్షన్ ఉండదని విమర్శించారు. నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు పది లక్షల మందిని తొలగించారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం వైకాపాకు లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండి అన్ని గ్రామ పంచాయతీల్లో తెదేపాను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
పత్తికొండలో నారా లోకేష్ పర్యాటన
రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా 42 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించిన ఆయన ఇసుక కొరత కారణంగా ఆత్మహత్య చేసుకున్న దాసరి సుంకన్న, కురువ నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. భవన నిర్మాణ కార్మికులు పని కోల్పోయినందుకు ఒక్కో కార్మికుడికి నెలకు పది వేల రూపాయలు చొప్పున ఐదు నెలలకు 50 వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.