శ్రీశైల దేవస్థానం ఆర్థిక వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించటం సహా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన 11 మంది అధికారులు, ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం జీవో నెం.518 జారీ చేసింది. సస్పెండ్ అయిన అధికారుల్లో ఆలయ ఏఈవో ఎస్వీ కృష్ణారెడ్డి, గతంలో ఏఈవోలుగా పనిచేసిన సీహెచ్. శ్రీనివాసరెడ్డి, ఐఎన్వీ. మోహన్ ఉన్నారు. తాజాగా పదవీ విరమణ చేసిన ఏఈవో సీ.రాజశేఖర్‌పై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు ఆలయ పర్యవేక్షకులు సి.మధుసూధన్ రెడ్డి, బి.మల్లికార్జున రెడ్డి, కె.వెంకటేశ్వర్రావులపై వేటు పడింది. సీనియర్ అసిస్టెంట్లు ఎ.శశిధర్ రెడ్డి, ఎస్ శ్రీనివాసరాజు, ఎమ్. శ్రీనివాసరావు, రికార్డు అసిస్టెంట్ ఎమ్.సావిత్రిని సస్పెండ్ చేశారు.
రూ.2 కోట్ల 56 లక్షలు స్వాహా...
శ్రీశైల దేవస్థానం టికెట్ల విక్రయాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మే నెలలో ఆయల అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఈవో రామారావు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందిన సర్కారు... అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను విచారణాధికారిగా నియమించింది. ఆయన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టారు. గత మూడేళ్లలో 2 కోట్ల 56 లక్షల రూపాయల నిధులు పక్కదారి పట్టాయని విచారణ నివేదికలో ప్రభుత్వానికి తెలిపారు. నివేదిక ఆధారంగా... అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కేసులు నమోదు...సొమ్ము రికవరీ
సాఫ్ట్ వేర్‌లోని లోపాలను అనుకూలంగా మార్చుకుని దేవస్థానం సొమ్మును కాజేసిన కేసులో... విచారణ చేపట్టాలని ప్రభుత్వం పోలీసులతో మరో కమిటీని నియమించింది. ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలోని కమిటీ... బ్యాంకుల తరఫున పనిచేసిన పొరుగుసేవల సిబ్బంది సహా కొందరు అధికారులను విచారించింది. ఇందులో ప్రధాన నిందితులైన దర్శిల్లీ, రూపేష్ సహా 24 మందిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి రూ.82 లక్షల నగదు, 7 లక్షల విలువైన కారు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మిగిలిన నిందితులపై కేసులు నమోదు చేసి...వారి నుంచి సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
శ్రీశైలంలో జరిగిన కుంభకోణంకు సంబంధించి 33 మంది అవినీతికి పాల్పడినట్లు గుర్తించారు. వీరిలో 11 మంది ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, ఇద్దరు సిస్టమ్ అడ్మిన్లు, 20 మంది పొరుగు సేవల సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : సరఫరా ఉత్పత్తులపై వివరణ ఇచ్చిన హెరిటేజ్