Orvakal Mega Industrial Hub: ఓర్వకల్లులో దక్షిణాదిలోనే పెద్ద పారిశ్రామికవాడ రాబోతోందని మన ఆర్థికమంత్రి బుగ్గన బీరాలు పలికారు. మరి ప్రస్తుతం ఓర్వకల్లు అలా మారిందా? పరిశ్రమలు తరలివచ్చాయా? ఉపాధి అవకాశాలు వచ్చాయా? రాయలసీమలో వెనకబడిన ప్రాంతమంటూ బుగ్గన చెప్పిన కర్నూలు జిల్లా .. తలరాత ఏమైనా మారిందా? అంటే.. లేదని అని ఇక్కడ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు.
అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలో భాగంగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఓర్వకల్లులో O.M.I.H. ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఈ హబ్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఓర్వకల్లు చుట్టుపక్కల 12 గ్రామాల పరిధిలో మొత్తం ఇరవై రెండు వేల ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తొలుత 13వేల 830 ఎకరాల భూమని A.P.I.I.C.కి కేటాయించింది. ఏకంగా 9వేల 455.41 ఎకరాల్లో భారీ పారిశ్రామిక హబ్‌ను అభివృద్ధి పనులను ప్రారంభించినా.. వీటిని నిర్మాణాత్మకంగా కొనసాగించడంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.
ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడులో జైరాజ్ ఇస్సాత్ ఉక్కు తయారీ పరిశ్రమకు 413 ఎకరాలు గత ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ 2వేల 932 కోట్లతో 2.2 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చి పనులు ప్రారంభించింది. ఈ ఒక్క పరిశ్రమలోనే 3వేల 200 మందికి ప్రత్యక్షంగా, 12 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. అప్పటి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఉక్కు రంగ అభివృద్ధికి అవసరమైన ఫౌండ్రిస్, ఆక్సిజన్ ప్లాంట్లు, మెషిన్ షాప్స్, ఫోర్జింగ్, లాజిస్టిక్స్, కెమికల్ ల్యాబ్స్ కూడా ఏర్పాటయ్యే అవకాశం ఏర్పడింది. మరో 28 బేసిక్ మెటల్, ఎల్లాయిస్ పరిశ్రమలు కూడా కర్నూలులో 23వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. అవి కూడా వస్తే మరో 28వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నాటి తెలుగుదేశం ప్రభుత్వం అంచనా వేసింది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పారిశ్రామికవాడను మరింతగా విస్తరించాలని తీర్మానించింది. నీటి సదుపాయాన్ని కల్పించేందుకు 560 కోట్లు విడుదల చేసినా నీటిని సరఫరా చేసే పనులు పూర్తిచేయడంలో ప్రభుత్వం విఫలమైంది. 6 నెలల కిందట 288 కోట్ల రూపాయలతో పైపులైను ఏర్పాటు పనులు ప్రారంభించారు. ముచ్చుమర్రి నుంచి కృష్ణా జలాలను ఓర్వకల్లుకు తీసుకురావాల్సి ఉంది. ఇందుకోసం ఏకంగా 57 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేయాలి.
ఇన్‌టేక్ వెల్, పంపింగ్ స్టేషన్లు, సంపులను నిర్మించాలి. ప్రస్తుతం పైపులైను పనులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల పూర్తికి మరో ఏడాదిన్నర సమయం అయినా పడుతుందని భావిస్తున్నారు. పారిశ్రామికవాడ అవసరాలకు వీలుగా 1 T.M.C. సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించాల్సి ఉండగా.. ఈ ప్రతిపాదనను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నాలుగేళ్లలో ఆర్భాటపు ప్రకటనలు తప్ప ఒక్క పరిశ్రమనూ వైసీపీ ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని.. కొత్తగా ఒక్క ఉద్యోగాన్ని ఇవ్వలేకపోయిందని భూములు ఇచ్చిన రైతులు చెబుతున్నారు.. మిగిలిన మౌలిక సదుపాయాలను సైతం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కల్పించలేదు.
విద్యుత్, గ్యాస్ సరఫరా, సీనరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, వీధి దీపాల వ్యవస్థ, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం విద్యుత్ సదుపాయం తప్ప మిగతా వసతులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేదు. హబ్ పరిధిలోనే చిన్నపాటి M.S.M.E. లను కూడా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సమారు 43.9 ఎకరాల్లో 198 ప్లాట్లను అభివృద్ధి చేశారు. వాటిలో 46 ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తైనా... మౌలిక సదుపాయాలు లేకపోవడంతో స్థలాలు పొందినవారు నిర్మాణ పనులను మొదలుపెట్టలేదు. ఎన్నికలకు ముందు సీమ బిడ్డను అని పదే పదే చెప్పుకున్న జగన్.. తమ ప్రాంత అభివృద్ధికి కనీస చొరవ తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. ఇదేనా రాయలసీమపై ఉన్న ప్రేమ అని నిలదీస్తున్నారు.