రాజ్యసభలో ఒకరితో మొదలయ్యామని, ఇప్పుడు ఆరుగురం అయ్యామని.. 2024 నాటికి 11 మంది అవుతామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. గెలిచిన నలుగురు అభ్యర్థులూ తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నలుగురూ విజయసాయిరెడ్డితో కలిసి విలేకర్లతో మాట్లాడారు. 'పార్లమెంటు ఉభయసభల్లో 30 మందికి పైగా సభ్యులున్న పార్టీకి కేంద్రంలో మంచి గుర్తింపు ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే శక్తి ఆ పార్టీకి ఉంటుంది. కాబట్టి మేం కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతాం' అని విజయసాయిరెడ్డి చెప్పారు.
రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. పార్టీలోని సీనియర్ సభ్యులతో కలిసి వాటి పరిష్కారానికి పనిచేస్తా. ప్రజలు, మీడియా ముందుకు వెళ్లి జగన్ రాష్ట్రానికి చేస్తున్న పనులు, ఆయన ఇమేజ్‌ను కొందరు ఎలా దెబ్బ తీస్తున్నారనేదీ వివరిస్తాం - పరిమళ్ నత్వానీ
రాష్ట్ర రెవెన్యూ లోటును కేంద్రం భరించాల్సి ఉన్నా.. ఇంతవరకూ ఆ సాయాన్ని పొందలేకపోయాం. దాంతోపాటు, కేంద్రం వద్ద పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారానికి అందరం పోరాడతాం - సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
ముఖ్యమంత్రి విజన్, ఆలోచనలకు తగినట్లుగా రాజ్యసభలో పనిచేస్తాం. ఈరోజు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుని వాటిపై ముందుకు వెళతాం -అయోధ్య రామిరెడ్డి
రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో ఎంత తూగగలరని చూసే ఖరారు చేస్తారు. తెదేపా అధికారంలో ఉన్నపుడు అదే చేసింది. ఇప్పుడు గెలవలేమనే ఎస్సీ నేత వర్ల రామయ్యను నిలబెట్టింది. కానీ, అలాంటి వాటికి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ పార్టీ కోసం పనిచేసిన మాలాంటి బీసీలకు అవకాశం కల్పించారు -మోపిదేవి వెంకటరమణ
గణనీయశక్తిగా వైకాపా: సజ్జల
రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా పెద్దల సభలో వైకాపా గణనీయశక్తిగా ఎదిగిందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ట్వీట్‌లో తెలిపారు. రానున్న రోజుల్లో 11 రాజ్యసభ సీట్లూ సాధించి, ప్రజల గొంతుకగా నిలిచి వారి ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని పేర్కొన్నారు.
గెలిచేటప్పుడు దళితులు గుర్తుకు రాలేదా?: బొత్స
రాజ్యసభ ఎన్నికల్లో తగిన సంఖ్యాబలం లేకపోయినా తెదేపా అభ్యర్థిని పోటీకి నిలపడం నీచమని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఆయన శుక్రవారం ఓటు వేశాక మరో మంత్రి కన్నబాబుతో కలసి అసెంబ్లీ ప్రాంగణంలో విలేకర్లతో మాట్లాడారు. ‘గెలుస్తామనుకున్నప్పుడు సుజనాచౌదరి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ వంటివారికి అవకాశమిచ్చారు. ఆ రోజు దళితులు గుర్తు రాలేదా?’ అని బొత్స విమర్శించారు.
ఇదీ చదవండి