అవినీతి, అక్రమాలకు పాల్పడిన 40 మంది వైకాపా ఎమ్మెల్యేలను జైలుకు పంపిస్తామన్న తెదేపా నేత నారా లోకేశ్ వ్యాఖ్యలపై వైకాపా మండిపడింది. సవాల్ చేసి హైదరాబాద్ పారిపోకుండా... ఆధారాలు ఉంటే బయటపెట్టాలని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. కనీసం ఒక్క ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. కరోనా ఇబ్బంది ఉన్నా సరే ప్రజల కోసం వైకాపా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని.. విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
"లోక జ్ఞానం లేని లోకేశ్... రాజారెడ్డి గురించి మాట్లాడుతున్నారు" అన్న జోగి రమేశ్.. రాజారెడ్డి రాజకీయాలు చేసినప్పుడు లోకేశ్ పుట్టలేదన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు, లోకేశ్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే వైకాపా ఉద్దేశమని స్పష్టం చేశారు. అమరావతిని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: