సాగు నీటి విషయంలో ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల జలకళ పథకాన్ని ప్రవేశపెట్టింది. విజయవాడ పరిధిలో మూడు నియోజకవర్గాలు మినహా జిల్లాలోని మిగిలిన 13 నియోజకవర్గాల్లో బోర్లు ఏర్పాటు చేసే నిమిత్తం పదమూడు రిగ్గులు కేటాయించారు.
‘ జలకళ’ ఇలా..
* సాగునీరు అందని రైతులకు ప్రభుత్వమే ఉచితంగా బోరు వేసి, మోటారు అందచేయడం జలకళ ఉద్దేశం. ఈ పథకం అమలుతో అత్యధికశాతం మందికి ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో తూర్పు కృష్ణాతో పోల్చితే పశ్చిమ కృష్ణాలో ఎక్కువ గ్రామాలకు సాగునీటి ఇబ్బందులున్నాయి. అన్నదాతలు బోర్లపైనే ఆధారపడాలి. భూగర్భజలాలు అంతగా అందుబాటులో ఉండని గ్రామాల్లో బోర్లు వేయించుకోవడం చిన్న రైతులకు తలకుమించిన భారం కావడంతో కాల్వల ద్వారా అందే నీరు, వర్షాలపైనే ఆధారపడుతూ సాగు ఇబ్బందులు అధిగమించాల్సి వచ్చేది.
*తూర్పు కృష్ణాలో కూడా సాగునీటి కాల్వల శివారు ప్రాంతాలకు సక్రమంగా నీరందక బోర్ల అవసరం ఏర్పడింది. తరచూ సాగునీటి విడుదలలో చోటుచేసుకునే జాప్యంతో సాగు ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో ఎక్కువ మంది నారుమళ్లను బోర్ల ఆధారంగానే పోస్తున్నారు. ఎలా చూసిన సాగు సవ్యంగా సాగాలని అత్యధికశాతం మంది బోర్లపైనే ఆధారపడుతున్నారు. అప్పులు చేసి బోర్లు వేసినా కొన్నిసార్లు నీరందక అధికమొత్తంలో కొందరు నష్టపోవాల్సి వస్తోంది.
సొంతంగా బోరు వేయించుకోలేని వారు ఎకరాకు కొంత మొత్తం చెల్లిస్తూ ఇతర రైతుల బోర్ల నుంచి నీరు పొందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జలకళ పథకం ద్వారా ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేసి, మోటార్లు సమకూర్చడంపై ఆనందం వ్యక్తమవుతోంది. అయితే పథకంపై ప్రభుత్వ నిబంధనలు వారి ఆశలపై నీళ్లుచల్లేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాలుగు మండలాల పరిధిలోని 27 గ్రామాలకు ఇబ్బంది
వాల్టా చట్టం ప్రకారం జిల్లాలోని ఆగిరిపల్లి, బాపులపాడు, ముసునూరు, నూజివీడు మండలాల పరిధిలోని 27 గ్రామాలను గతంలో అత్యధిక భూగర్బజల వినియోగించిన గ్రామాలుగా గుర్తించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జలకళ పథకం ఈ వీటికి వర్తించదు. మిగిలిన గ్రామాల్లోనూ ఇప్పటికే బోరుబావులున్న వారికి ఈ పథకం వర్తించదని నిబంధనల్లో పేర్కొన్నారు. జిల్లాలో 95,560 బోరుబావులుండగా అందులో 88,989 వినియోగంలో ఉన్నాయి. మిగిలినవి నిరుపయోగంగా ఉన్నాయి. ఇతర మండలాల్లోని గ్రామాల్లో సైతం రెండు బోర్ల మధ్య కనీస దూరం పాటించాలన్న వాల్టా నిబంధన ప్రకారం రెండు ఎకారాల లోపు ఉండే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు,గతంలో భూగర్భజలాలు పెంపుకు తీనుకున్న చర్యలతో ఈ నాలుగు మండలాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి. అయినా పాత నివేదికల ప్రకారం జలకళ పథకాన్ని వర్తింప చేయకపోవడం సరికాదని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. 2.5 ఎకరాల విస్తీర్ణంలోపు ఉన్న రైతులు ఇద్దరి, ముగ్గురిని కలిపి దరఖాస్తు చేసుకోమనడం కూడా సాధ్యపడే విషయం కాదని.. నిబంధనల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుకుంటున్నారు.
ప్రతి రైతుకు న్యాయం చేస్తాం
“ జలకళ పథకంతో ప్రతి రైతుకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. గతంలో వాల్టా చట్ట కింద అత్యధిక భూగర్భజల వినియోగిత గ్రామాలుగా గుర్తించిన నాలుగు మండలాల పరిధిలోని గ్రామాల్లో కూడా మేలు చేసే లక్ష్యంతో మరింతగా భూగర్భ జలాలను వృద్ధి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులు సైతం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకున్న వారికి బోరు ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే 866కి పైగా దరఖాస్తులు అందగా సంబంధిత ఏజెన్సీలకు పనులు అప్పగించాం. “- జీవీ సూర్యనారాయణ, డ్వామా పీడీ
ఇవీ చదవండి: