కృష్ణా జిల్లా అనాసాగరం జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం విద్యార్థి గోపీచరణ్(15) విద్యుదాఘాతంతో మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సీఐ కనకారావు, బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన దారం మురళీకృష్ణ, వెంకట్రావమ్మలు కూలీపనులు చేస్తూ జీవిస్తుంటారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో పెద్ద కుమారుడు గోపీచరణ్ పది, చిన్న కుమారుడు వేణుగోపాల్ ఏడో తరగతి చదువుతున్నారు. మండల పరిషత్ పాఠశాలలో కుమార్తె సిరి మూడో తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి చెప్పడంతో మరుగుదొడ్డిపైనున్న నీటిట్యాంకును శుభ్రం చేసేందుకు గోపీచరణ్ పైకి ఎక్కాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ట్యాంక్‌పైనున్న విద్యుత్తు తీగలు తగలడంతో ఆ బాలుడు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరాడు. అతన్ని నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడ మృతిచెందాడు.
ఉపాధ్యాయులు పట్టించుకోలేదు...
ప్రమాదానికి గురైన విద్యార్థిని వెంటనే వైద్యశాలకు తరలించలేదని, గ్రామస్థులు వచ్చేవరకు ఉపాధ్యాయులు పట్టించుకోలేదని బంధువులు వాపోయారు. మృతుడి తల్లిదండ్రులు మురళీకృష్ణ, వెంకట్రావమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హెచ్.ఎం. పద్మావతి, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతిచెందాడని బంధువులు, గ్రామస్థులు ఆరోపించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. దీంతో వైద్యశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. మృతదేహాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మొండితోక అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యలు పరిశీలించి, తల్లిదండ్రులను పరామర్శించారు. నందిగామ సీఐ కనకారావు, తహసీల్దారు చంద్రశేఖర్, ఎంఈవో బాలాజీలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎంఈవో బాలాజీ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయురాలు ట్యాంక్ ఎలా ఉందో చూడమని విద్యార్థిని ఎక్కించారని, విద్యుత్తు తీగలు తగలడంతో మృతిచెందారని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆర్జేడీ ఆదేశించారుమృతిచెందిన విద్యార్థి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ మొండితోక అరుణ్‌కుమార్ చెప్పారు.
ఇదీ చదవండి: ప్రముఖ రచయిత గెయిల్ ఓంవేద్ కన్నుమూత