విజయవాడకు చెందిన సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహనరావు (80) గుండెపోటుతో మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామ్మోహనరావు.. కొంతకాలంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామ్మోహనరావు భౌతికకాయాన్ని ప్రస్తుతం సూర్యారావుపేటలోని ఆయన నివాసంలో ఉంచారు. ఈరోజు (సోమవారం) అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఎంపీ కేశినేని నాని, రాష్ట్ర బార్‌కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు, బార్‌కౌన్సిల్ సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్, చలసాని అజయ్‌కుమార్, ఏఐసీసీ కార్యవర్గ సభ్యుడు నరహరిశెట్టి నరసింహారావు, తెదేపా అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ, చేకూరి శ్రీపతిరావు, బెనర్జీ తదితరులు కర్నాటికి నివాళులర్పించారు.
క్రిమినల్ కేసుల వాదనలో దిట్ట..
కర్నాటి రామ్మోహనరావు 1967 జులై 4న రాష్ట్ర బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు. అనంతరం విజయవాడలో ప్రాక్టీసు ప్రారంభించారు. ఈ క్రమంలో.. అనేక సంచలనాత్మక కేసులను వాదించారు. క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్టగా పేరుగాంచారు. ఉరిశిక్షలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు. వంగవీటి మోహనరంగా, దేవినేని నెహ్రూ ఇరు వర్గాల కేసులను వాదించారు.
విజయవాడ- గుంటూరు మధ్యలో హైకోర్టు బెంచి కోసం ఉద్యమించారు. రాష్ట్రంలో ఎక్కడైనా మానవహక్కుల ఉల్లంఘన జరిగితే తన గళాన్ని వినిపిస్తూ అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. తెదేపా ఆవిర్భావ సమయంలో రామ్మోహనరావు ప్రముఖ పాత్ర పోషించారు. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న నగరపాలక సంస్థ పాఠశాల అభివృద్ధికి నిధులు ఇవ్వడంతో.. కర్నాటి రామ్మోహనరావు పేరునే పెట్టారు.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి: కనకమేడల
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ, పౌరహక్కుల సాధనకు సీనియర్ న్యాయవాది కర్నాటి రామ్మోహనరావు నిర్విరామ కృషి చేశారని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కొనియాడారు. రామ్మోహనరావు మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ఆ విషయమై గొడవ.. జవాన్ల మధ్య కాల్పులు.. నలుగురు మృతి!