కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో... శివరాత్రి సందర్భంగా పంది మాంసం నైవేద్యంగా పెట్టి భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారనే కథనంలో... ఎంతమాత్రం నిజం లేదంటూ ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ శర్మ స్పష్టం చేశారు. మహాశివరాత్రి రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. సమీపంలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తమ్మిలేరు అవతలి గట్టు ప్రాంతంలో పంది మాంసం కొనుగోళ్లు జరుగుతున్నాయని... ఈ ఆలయానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
పంది మాంసానికి మంచి గిరాకీ
ఆలయ ప్రాంతంలో అనుమతులు లేనప్పటికీ తమ్మిలేరు అవతలి ఒడ్డున పందులను కోసి వాటి మాంసాన్ని అమ్ముతుంటారు. శివరాత్రి ఉత్సవాల్లో ఇక్కడ అమ్మే పంది మాంసానికి మంచి గిరాకీ ఉంటుందని విక్రయదారులు పేర్కొన్నారు. ఏటా స్వామి వారిని దర్శించుకుని... పంది మాంసాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకు వెళ్లడం ఆచారంగా మారిందని మాంస ప్రియులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సుమారు 1500 పందులను కోసి అమ్మినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కేజీ 200 రూపాయలకు అమ్మకాలు సాగిస్తున్నట్లు వివరించారు.