కృష్ణా జిల్లాలో వరికోతలు మొత్తం పూర్తయ్యాయి. రోడ్లమీదే ధాన్యం రాశులు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలు, తౌక్టే తుపాను ప్రభావం తప్పింది. కొన్ని మండలాల్లో ఓ మోస్తరు జల్లులు కురిశాయి. రైతులు ఎలాగో కష్టపడి పట్టాలు కప్పి కాపాడుకున్నారు. మళ్లీ యాస్ తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మూడు, నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎందుకిలా..?..
గత నెల రోజులుగా జేసీ మాధవీలత డయల్ యువర్ జేసీ పేరుతో రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రతి ఫిర్యాదు ధాన్యం కొనుగోలుకు సంబంధించే ఉంటోంది. ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నారు. కానీ వారం గడిచినా అదే పరిస్థితి. మళ్లీ అదే గ్రామం నుంచి అదే ఫిర్యాదు. గత నెల రోజుల్లో చాలా తక్కువగా కొనుగోలు చేశారు. మరోవైపు మిల్లర్లు ప్రైవేటుగా ధర తగ్గించి చాలా వరకు ధాన్యం కొనుగోలు చేశారు. ఖరీఫ్ ధాన్యం మిల్లుల నిండా ఉంది. దీంతో రబీ ధాన్యం ఆర్‌బీకే ల నుంచి మిల్లులకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే జాప్యం జరుగుతోంది. మరోవైపు రైతులు సాగు చేసిన ధాన్యం రకాలు మిల్లింగ్‌కు అనువుగా లేవని చెబుతున్నారు. ముక్కపాయ ఎక్కువగా వస్తోంది. దీంతో మిల్లర్లు బలవంతంగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. తాలు శాతం కూడా ఎక్కువగా వస్తోందనేది మిల్లర్ల ఆరోపణ.
జిల్లాలో దాదాపు 2.75లక్షల ఎకరాల్లో రబీ సాగు చేశారు. కానీ ఎంటీయూ 1121 చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఎక్కువ శాతం ఎంటీయూ 1156, 1153, కొన్ని మండలాల్లో 1010, 1001 సాగు చేశారు. ప్రస్తుతం ఈ నాలుగు రకాలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. బస్తా ధాన్యం ఎంఎస్‌పీ ప్రకారం రూ.1401 రావాల్సి ఉండగా రూ.950 నుంచి రూ.1050 వరకు విక్రయించుకొన్నారు. ప్రస్తుతం చాలా మండలాల్లో ధాన్యం రాశులు నిల్వ ఉన్నాయి. వర్షానికి తడిస్తే నిండా మునిగినట్లేనని వాపోతున్నారు. విజయవాడ గ్రామీణం, జి.కొండూరు, పెనమలూరు, తోట్లవల్లూరు, పమిడిముక్కల, రెడ్డిగూడెం, నందిగామ, కంకిపాడు, బంటుమిల్లి, ఇబ్రహీంపట్నం, చందర్లపాడు, మైలవరం, విస్సన్నపేట, కలిదిండి మండలాల్లో ధాన్యం ఉంది. జిల్లా వ్యాప్తంగా 500 రైతుభరోసా కేంద్రాల్లో కొనుగోలుకు అవకాశం కల్పించారు. కానీ అక్కడ అంతగా స్పందన ఉండడం లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు.
గోదాములు లేక..!.. మిల్లర్లు ధాన్యం ఆడించి ఎఫ్‌సీఐకు సరఫరా చేయాల్సి ఉంది. ఇటీవల భారత ఆహార సంస్థ ఇబ్బంది పెట్టింది. బియ్యం తీసుకోలేదు. కొన్ని రోజుల పాటు లారీలు ఎఫ్‌సీఐ గోదాముల ముందు నిలిచిపోయాయి. తర్వాత అధికారులు సంప్రదించి పరిష్కరించినా ఎక్కువ తీసుకోవడం లేదని చెబుతున్నారు. దీంతో మిల్లులకు ధాన్యం ఇవ్వడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వారం రోజుల్లో జూన్ వస్తోంది. మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. అప్పటికీ ధాన్యం సేకరణ జరుగుతుందో లేదోనన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది
రైతుల దగ్గర ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కొన్ని నిషేధించిన రకాలు సాగు చేశారు. అవి బియ్యం తక్కువ వస్తున్నాయని మిల్లర్లు చెబుతున్నారు. ఎఫ్‌సీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. మిల్లర్లను తీసుకోవాలని సూచించాం. ఆర్‌బీకే వద్ద పొలం వివరాలు, ఆధార్, బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ నెంబరుతో సంప్రదించాలి. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. సంచుల కొరత లేకుండా చూస్తున్నాం. -కె.మాధవీలత, జేసీ
పెనమలూరు మండలం చోడవరానికి చెందిన ఉప్పులూరి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఎస్‌ఈ. సేద్యంపై మక్కువతో విశ్రాంతి తీసుకునే వయస్సులోనూ వరి సాగు చేస్తున్నారు. 25 ఎకరాల్లో రబీ సాగు చేశారు. దాదాపు 1500 బస్తాలు కళ్లాలపై ఉన్నాయి. ఇటీవల డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో తన పరిస్థితి జేసీ కె.మాధవీలతకు వివరించారు. అధికారులు వస్తారు, ధాన్యం కొనుగోలు చేస్తారని భరోసా ఇచ్చారు. తహసీల్దారును కలిశారు. ఆయన అదే మాట చెప్పారు. నాలుగైదు రోజులు గడిచినా ఎవరూ రాలేదు. ఆర్‌బీకే సిబ్బంది అసలు కల్లం వైపు చూడనేలేదు. ప్రస్తుతం తుపాను భయం పట్టుకుంది.
పెదపులిపాక గ్రామానికి చెందిన ముసునూరి శ్రీనివాసరావు 17 ఎకరాల్లో ఎంటీయూ 1121 సాగు చేశారు. దాదాపు 500 బస్తాల ధాన్యం రాశుల్లోనే ఉంది. ఆర్‌బీకే చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. సంచులు లేవు.. అని ఒకసారి, ముక్కపాయ వస్తుందని ఒకసారి సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం ధాన్యం రాశులను తడవకుండా ఎలా కాపాడుకోవాలో అంతుచిక్కడం లేదని వాపోతున్నారు.
మొత్తం రైతులు 10,085
ధాన్యం విలువ రూ.162.92కోట్లు
నిన్నటి వరకు సేకరణ 1,32,133 ఎంటీలు
రబీలో ధాన్యం సేకరణ లక్ష్యం 6 లక్షల
మెట్రిక్ టన్నులు మొత్తం ఆర్‌బీకేలు 500
ఇదీ చదవండి: దూసుకొస్తున్న 'యాస్'...రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం!