గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా... ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, తెరాస కార్పొరేటర్లు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని అభినందించిన సీఎం... దిశానిర్దేశం చేశారు. కోట్లాది మందిలో కేవలం కొంతమందికి మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందని... ప్రజలు ఇచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాజీవితంలో మంచి పేరు తెచ్చుకోవడమే గొప్ప విషయమని ముఖ్యమంత్రి అన్నారు. మంచిగా ఉంటేనే బట్టకాల్చి మీదవేసే ఈ రోజుల్లో... కొద్దిగా అవకాశం ఇస్తే చాలా చెడ్డపేరు వస్తుందని.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికారు.
బస్తీల్లో పేదల కష్టాలు..
పదవిలో ఉన్న వారు ఎంతో సంయమనం, సహనంతో, సాదాసీదాగా ఉండాలన్న కేసీఆర్... వేషభాషల్లో మార్పులు రావద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ సహజత్వాన్ని కోల్పోవద్దని చెప్పారు. అసంబద్ధంగా, అవసరం లేని మాటలతో లాభమేమీ లేకపోగా... వికటించే అవకాశం ఉంటుందన్నారు. కులం, మతం చూడకుండా... ప్రతి ఒక్కరినీ ఆదరించాలని, అక్కున చేర్చుకోవాలని సీఎం చెప్పారు. చెప్పేది ఓపిగ్గా విని చేతనైనంత సాయం చేయాలన్న సీఎం... అబద్ధాలు చెప్పవద్దని సూచించారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని సూచించారు. గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దదంటూ గోరటి వెంకన్న రాసిన పాటను తాను వందసార్లు విన్నానన్న కేసీఆర్.. అందులో బస్తీల్లో పేదల కష్టాలు, గోసలున్నాయని చెప్పారు. ఆ పాట విని కష్టనష్టాలను అర్థం చేసుకోవాలని చెప్పారు. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించి.. పేదల బాధలు అర్థం చేసుకొని సమస్యలు తీర్చాలని సీఎం స్పష్టం చేశారు. అదే ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు.
ఎంత మంది ఉన్నా..
హైదరాబాద్ నగరానికి అనేక అనుకూలతలున్నాయని... మంచి భవిష్యత్ ఉందని సీఎం అన్నారు. బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కూడా... ఇక్కడ స్థిరపడిన అనేక మందితో ఇది నిజమైన విశ్వనగరమని వ్యాఖ్యానించారు. ఇక్కడున్న విభిన్న ప్రాంతాలు, విభిన్న మతాలు... విభిన్న సంస్కృతుల వారంతా హైదరాబాదీలుగా గర్విస్తున్నారని... నగరం ఓ మినీ ఇండియాలాగా ఉంటుందన్నారు. అందరినీ ఆదరించే ప్రేమ గల నగరంగా అభివర్ణించారు. ఇంత గొప్ప నగరం... భవిష్యత్తు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల మీద ఉందన్న మఖ్యమంత్రి... గొప్పగా పనిచేసి నగర వైభవాన్ని పెంచాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని చెప్పారు. ప్రభుత్వం కూడా... హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వాటికి సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. కార్పొరేటర్లలో ఒక్కరికే మేయర్‌గా అవకాశం దక్కుతుందని.. అర్హతలున్న వారు... చాలా మంది ఉన్నప్పటికీ అందరికీ ఇవ్వలేమని కేసీఆర్ అన్నారు. తన పరిస్థితుల్లో వారున్నా అంతే చేయగలరని.. అర్థం చేసుకొని అందరూ కలిసికట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: