కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. పాజిటివ్ కేసులు విజయవాడ నగరంలోనే అధికంగా ఉండటంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మాస్క్ లేకుండా రోడ్లపైకి వస్తే కేసు నమోదు చేస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. విజయవాడ పరిధిలో మొత్తం 8 రెడ్‌జోన్ ప్రాంతాలున్నాయి. ఇక్కడ సీసీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
రెడ్‌జోన్ ప్రాంతాల్లో నిబంధనలు మరింత కఠినతరం చేసి... ఎస్డీఆర్ఎఫ్ బలగాలతో పహారా ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు మొబైల్ వాహనాల ద్వారా ప్రజలకు అందిస్తారు. రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటకు వస్తే వారిపై కేసు నమోదు చేసి క్వారంటైన్ కేంద్రానికి పంపుతామన్నారు.
నిత్యావసరాల కొనుగోలుకు కేటాయించిన సమయాన్ని, అత్యవసర పాస్‌లను దుర్వినియోగం చేస్తే కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో శుక్రవారం ఒక్కరోజు 14 కేసులు వచ్చాయి. ఇవన్నీ విజయవాడ నగరంలోనివే కావడం గమనార్హం. నగరంలో పనిచేస్తున్న ఎస్సైకి పాజిటివ్ అని తేలటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. అతనితో పాటు సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. ఎస్సై విధులు నిర్వహిస్తున్న స్టేషన్లో సిబ్బందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి