కృష్ణా వరద ఉద్ధృతితో లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. విజయవాడలో 31 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా... కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, తారకరామ నగర్‌కు చెందిన పలు కుటుంబాలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నాయి. సదుపాయాలు బాగానే ఉన్నప్పటికీ.. రాత్రివేళ దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నారు. వరద బాధితులకు నాణ్యమైన ఏర్పాట్లు చేయడం సహా... కరోనా, సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టామని అధికారులు వివరించారు.
చల్లపల్లి మండలం, ఆముదార్లంక గ్రామంలోకి వరద పోటెత్తగా... పదుల సంఖ్యలో కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. పెద్దసంఖ్యలో ప్రజలు మూటాముల్లె సర్దుకొని బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. అధికారులు పునరావాసం కోసం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని వారు ఆరోపిస్తున్నారు. వరదలు వచ్చిన ప్రతిసారీ ఆర్థికంగా నష్టపోతున్నామని.. గతేడాది పంట నష్టం పరిహారం ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని వాపోయారు.
కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలం, పాత ఎడ్లలంక కాజ్‌వేపై వరద ఉద్ధృతికి గండి పడింది. ఎడ్లలంక, అవనిగడ్డ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గండి పడిన ప్రాంతాన్ని అవనిగడ్డ శాసనసభ్యుడు సింహాద్రి రమేష్ బాబు పరిశీలించారు. వరద తగ్గేంతవరకూ ఎడ్లలంక వద్ద అత్యవసర రాకపోకలకు పడవల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. మరోవైపు... పులిగడ్డ అక్విడక్ట్, వరద ముంపు గ్రామాల్లోకి ప్రజలు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాల్లో జలవనరుల శాఖ అధికారులు పర్యటించారు. విజయవాడ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇసుక బస్తాలు వేసి కరకట్ట పటిష్టతకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కృష్ణలంక, రాణిగారి తోట, తారకరామ నగర్, భూపేష్ గుప్తా నగర్, కోటినగర్, ఈనాడు కాలనీ, రామలింగేశ్వర నగర్, యనమల కుదురు వరకు కృష్ణానది ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. కృష్ణలంక వరద కరకట్ట, కృష్ణానది మార్జిన్, రిటైనింగ్ వాల్, యనమల కుదురు ర్యాంప్ వరకు పటిష్ట పరచవలసిన ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎలాంటి వరద వచ్చిన తట్టుకునేలా యనమలకుదురు రిటైనింగ్ వాల్‌ను ఇసుక బస్తాలతో మరింత పటిష్టం చేయాలని సూచించారు.
ఇదీ చదవండీ... కృష్ణా జిల్లాలో తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి