కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలో... కరోనా వ్యాప్తి నియంత్రణను కాంక్షిస్తూ శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో లీలా కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా క్రతువు పూర్తి చేశారు.
తిరుపతమ్మ ఆలయంలో
జిల్లాలోని తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో కరోనా మహమ్మారి నివారణను కాంక్షిస్తూ మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు. వరద గణపతి, అమృత మృత్యుంజయ, మహాసుదర్శన, శ్రీలక్ష్మీ హోమాలు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా జరిపించనున్నట్లు ఆలయ ఈవో శోభారాణి తెలిపారు.
మైలవరంలో
కరోనా వ్యాధి వ్యాప్తి అరికట్టాలని కోరుతూ.. కృష్ణా జిల్లా మైలవరంలో పీడా హర యాగాన్ని నిర్వహించారు. మానవాళి మనుగడకు పూర్వకాలం నుంచి ఋషులు ఎన్నో యాగాలు నిర్వహించేవారని, అందుకే శాస్త్రోక్తంగా పుణ్య ద్రవ్యాలు వాడి కరోనా తగ్గుముఖం పట్టాలనే సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహిస్తామని అర్చకులు తెలిపారు.
శ్రీకాళహస్తిలో
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలనే సంకల్పంతో శ్రీకాళహస్తీశ్వరాలయంలో మృత్యుంజయ హోమం కొనసాగుతోంది. ఆలయంలోని మృత్యుంజయ స్వామికి నాలుగు రోజులుగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నాలుగో రోజున స్వామివారికి చందనం, నారికేళం, విభూది, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. వేద పారాయణంతో హోమపూజలు చేపట్టి పూర్ణాహుతి నిర్వహించారు.
ఇదీ చదవండి: