హైదరాబాద్ మల్లాపూర్‌లో మృతిచెందిన గర్భిణీ పావని అంత్యక్రియలు ముగిశాయి. మల్లాపూర్ వైకుంఠధామంలో తల్లికి, శిశువుకు వేర్వేరుగా దహన సంస్కారాలు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యంతో.. శుక్రవారం రోజున ఈ గర్భిణీ మరణించింది.
కరోనా భయంతో పావనిని చేర్చుకోలేదు..
పావనికి నిన్న తెల్లవారుజామున ఆయాసం రాగా.. ఆస్పత్రికి వెళ్లారు. ఎప్పుడూ వెళ్లే దవాఖానా అయినా.. కరోనా భయంతో పావనిని చేర్చుకోలేదు. నిండు చూలాలన్న కనికరం లేకుండా పంపించివేశారు. ఎప్పుడూ ఇక్కడికే వస్తున్నామని వైద్యం చేయాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. దిక్కుతోచని స్థితిలో అంబులెన్స్‌లోనే మరో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. ఇలా పలు ఆస్పత్రులు తిరిగినా.. ఎవరూ చేర్చుకోలేదు. గాంధీ లేదా కోఠి ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు.
మార్గ మధ్యలోనే తుదిశ్వాస..
చివరికి కోఠి ప్రసూతి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే పావని ప్రాణాలు కోల్పోయింది. కోఠి ఆస్పత్రికి చేరుకుని కనీసం శిశువునైనా బతికించాలని పావని తల్లి వేడుకోగా.. తల్లి, శిశువు ఇద్దరు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పొద్దున్నుంచి ఇద్దరినీ కాపాడుకునేందుకు తల్లి నీలవేణి పడిన తపన, చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి.
పుట్టెడు దుఃఖంలో..
అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఆమె మృతదేహాన్ని మల్లాపూర్ శ్మశానవాటికకు తీసుకెళ్లగా అక్కడ తల్లినీ బిడ్డను వేరు చేస్తేగానీ దహనం చేయడం కుదరదని నిర్వాహకులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఐదు బాధిత కుటుంబీకులు ఆసుపత్రుల్ని సంప్రదించగా.. వారూ శస్త్రచికిత్స చేయడం కుదరదని చేతులెత్తేశారు. దిక్కుతోచని స్థితిలో మృతదేహాన్ని ఇంటికే తీసుకెళ్లారు. ఇవాళ స్థానిక ఆసుపత్రిలో తల్లి, బిడ్డ మృతదేహాలను వేరు చేశారు. పుట్టెడు దుఃఖంలో మల్లాపూర్ వైకుంఠధామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఓవైపు పావని మరణం, అంత్యక్రియలకు పడ్డ కష్టంతో ఆ కుటుంబాల్లో మరింత వేదన మిగిల్చింది.
- సంబంధిత కథనం : కరుణ చూపని ఆస్పత్రులు.. గాల్లో కలిసిన రెండు ప్రాణాలు