కృష్ణా జిల్లాలో వ్యవసాయం, ఆక్వా తర్వాత నిర్మాణ రంగమే ప్రధాన ఉపాధి మార్గంగా ఉంది. లక్షల మంది కార్మికులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. కృత్తివెన్ను మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇంటింటికీ నిర్మాణ రంగానికి చెందిన మేస్త్రీలు, కూలీలు ఉన్నారు. విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో అధికంగా సాగే నిర్మాణ పనుల్లో ఉపాధి పొందుతారు. కొవిడ్ విస్తృతంగా వ్యాప్తి చెందటంతో కొంతమంది కార్మికులు మృతిచెందారు. సాధారణంగా నిర్మాణ రంగంలో కార్మికుల మధ్య భౌతిక దూరం పాటించటం సాధ్యం కాదు. ఒక్కోసారి ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈనేపథ్యంలో కొవిడ్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
పెడనలో 25కు పైగా భవనాలను నిర్మిస్తున్న మచిలీపట్నానికి చెందిన ఒక మేస్త్రీ ఇటీవల కరోనాతో మృతిచెందారు. మరికొందరు ఆస్పత్రుల్లో, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో కార్మికుల్లో కలవరం మొదలయ్యింది. పనికి వెళ్తే తమతోపాటు కుటుంబ సభ్యులు కూడా కొవిడ్ బారిన పడతారని ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో దాదాపు 15 రోజుల నుంచి నిర్మాణ రంగం పాక్షికంగా నడుస్తోంది.
గృహ ప్రవేశ ముహూర్తాలు దగ్గరకు వచ్చి చివరిదశలో అత్యవసరంగా పూర్తి చేయాల్సిన పనులకు మాత్రమే కార్మికులు హాజరవుతున్నారు. కొద్ది నెలల క్రితం మొదలై వివిధ దశలకు చేరిన భవనాల పనులను నిలిపివేశారు. భవన నిర్మాణరంగంలోని తాపీ మేస్త్రీలు, కూలీలతోపాటు రాడ్ బెండింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, వెల్డింగ్ తదితర విభాగాల కార్మికులు కొవిడ్ తీవ్రతకు భయబ్రాంతులవుతున్నారు. ఈ నెలలో రెండ్రోజుల క్రితం వరకు ముహూర్తాలు ఉండటంతో కొత్త నిర్మాణాలను ప్రారంభించాల్సిన యజమానులు కూడా వెనుకంజ వేశారు. మొత్తమ్మీద నిర్మాణ రంగంపై రానున్న రెండ్నెళ్లు కొవిడ్ ప్రభావం చూపించనుంది.
పెరుగుతున్న ధరలు
ఈ రంగంపై నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల ప్రభావం కూడా కన్పిస్తోంది. గతేడాది రూ.300 ఉన్న సిమెంటు 50 కిలోల బస్తా ధర ఈసారి రూ.390కు చేరుకుంది. ఇసుక 30 టన్నులను రూ.30 వేల వరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ.15 వేలలోపు ఉండేది. ఇనుము ఒక్కసారిగా టన్ను రూ.45 వేల నుంచి రూ.68 వేలకు పెరిగిపోయింది. మెటల్ ధర కూడా టన్ను రూ.వెయ్యి పలుకుతోంది. ఇలా నిర్మాణ రంగంలో వినియోగించే సామగ్రి ధరలు పెరగటంతో మధ్య తరగతి ప్రజలు సొంత ఇంటి నిర్మాణానికి వెనుకంజ వేస్తున్నారు.
ఇదే సమయంలో కొవిడ్ ఉద్ధృతి మరో కారణంగా నిలుస్తోంది. బిల్లుల చెల్లింపులు నిలిచి గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన సచివాలయ, ఆర్బీకే భవనాల నిర్మాణం కూడా దాదాపు స్తంభించింది. నియోజకవర్గంలో దాదాపు 60 సచివాలయ భవనాలు వివిధ దశల్లో నిలిచిపోయాయి. ప్రస్తుతం తిరిగి మొదలుపెట్టినా కార్మికులు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అప్పులు చేసైనా బతుకుతాం కానీ కొవిడ్ బారిన పడి ఆస్పత్రుల్లో నరకం చూడలేమని కార్మికులు అంటున్నారు.
ఇదీ చదవండి: