తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజులపాటు కృష్ణా జిల్లా పార్టీ నేతలతో నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించనున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా... మెుదట పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి... ఆ తర్వాత రోజుకు ఐదు నియోజకవర్గాల చొప్పున సమీక్షలు కొనసాగిస్తారు. తొలిరోజు పెడన, కైకలూరు, మచిలీపట్నం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై మార్గనిర్దేశం చేస్తారు.
రాజీనామాతో గరంగరం
కృష్ణా జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి మంచి పట్టున్నా.. గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ తూర్పు, గన్నవరం మినహా మిగతా చోట్ల ఊహించని పరాభవం ఎదురైంది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం... చర్చనీయాంశమైంది.
చంద్రబాబు నిర్ణయమేంటని ఉత్కంఠ!
గన్నవరం గందరగోళానికి ఎలా తెరపడుతుందన్నది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో ఉన్న ఆసక్తి. వంశీతో మాట్లాడాలని పార్టీ నేతలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణను రంగంలోకి దించిన చంద్రబాబు ...సమస్యల పరిష్కారానికి రాజీనామా సరికాదని.. వైకాపా సర్కార్ అప్రజాస్వామిక విధానాలపై కలిసికట్టుగా పోరాడదామని ప్రత్యుత్తరం పంపారు. అయినా.... వంశీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వంశీ స్పష్టత ఇస్తేనే.. ఈ గందరగోళానికి తెరపడే అవకాశముంది. ఇదే సమయంలో ఇవాళ జరిగే జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో... చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో అని నేతలూ ఎదురుచూస్తున్నారు.
రేసులో చాలామంది నేతలు!
గన్నవరానికి కొత్త ఇన్ఛార్జిని ప్రకటిస్తే గుడివాడ, పెడన, అవనిగడ్డ, నూజివీడు, పామర్రు వంటి నాయకత్వ లోపాలు కనిపిస్తున్న చోట్ల కూడా... పలు మార్పులు ఉండే అవకాశం ఉంది. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ది తొలుత గన్నవరం నియోజకవర్గమే కావడంతో.. ఆయన భార్య గద్దె అనురాధతోపాట దేవినేని అవినాష్, బోడె ప్రసాద్ పేర్లు గన్నవరం ఇన్‌ఛార్జ్ రేసులో వినిపిస్తున్నాయి. బోడెప్రసాద్, అవినాష్‌లలో ఒకరికి గన్నవరం, మరొకరికి పెనమలూరు సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. చంద్రబాబు వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించకపోయినా.. రానున్న రోజులకు అనుగుణంగా కొందరికి బాధ్యతలు అప్పగించవచ్చని తెలుస్తోంది.
ఇదీ చదవండి:గన్నవరం రాజకీయం... గరంగరం