కృష్ణా జిల్లా మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్, మంత్రి పేర్నినాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరావు హత్యకు గురయ్యారు. ఉదయం చేపల మార్కెట్ వద్ద ఉండగా దుండగులు కత్తులతో ఆయనపై దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలైన భాస్కరరావును స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడి సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా నలుగురు వ్యక్తులు హత్య చేసినట్లు గుర్తించారు. హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేసినట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. 2013లో జరిగిన ఓ హత్య కేసులో భాస్కరరావు ముద్దాయిగా ఉన్నట్లు చెప్పారు.
మంత్రి పరామర్శ
విషయం తెలుసుకున్న మంత్రి పేర్నినాని.. భాస్కరరావు మృతికి సంతాపం తెలిపారు. ఆస్పత్రికి చేరుకుని మృతదేహం వద్ద విలపించారు. మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.
రాజకీయ హత్యే..!
మోకా భాస్కరరావుది రాజకీయ హత్యేనని మంత్రి పేర్నినాని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కిరాయి మనుషులతో చంపించారని అన్నారు. హత్యకు 3 రోజులపాటు రెక్కీ నిర్వహించినట్లు భావిస్తున్నామని చెప్పారు. ఘటనపై తనతో, ఎస్పీతో ముఖ్యమంత్రి జగన్ ఫోన్లో మాట్లాడారని మంత్రి తెలిపారు.
ఇదీ చూడండి..