CANAL: కోనసీమ జిల్లా గన్నవరం ప్రధాన పంట కాలువకు అకస్మాత్తుగా నీటిని విడుదల చేశారు. దీంతో గంటి పెదపూడి నుంచి పి.గన్నవరం వరకు చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగింది. ఒక్కసారిగా నీరు రావడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
జూన్ 1న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాలువలకు సాగునీరు విడుదల చేశారు. అయితే.. గంటి పెదపూడి నుంచి పి.గన్నవరం వరకు రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా జూన్ 10 తర్వాత సాగునీరు విడుదల చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆర్ అండ్ బీ అధికారులు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జలవనరుల అధికారులు అంగీకారం తెలిపారు. మరోవైపు ప్రజాప్రతినిధులు సైతం అభివృద్ధి పనుల కారణంగా జూన్ 10 తర్వాతనే గన్నవరం కాలువకు సాగునీరు విడుదల చేయాలని జలవనరుల శాఖకు ముందే చెప్పారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా గురువారం రాత్రి 11 గంటల సమయంలో నీరు విడుదలైంది. దాంతో.. ఎక్కడి పనులు అక్కడే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే.. గన్నవరం ప్రధాన పంట కాలువకు సాగునీరు విడుదల చేయలేదని.. లొల్ల ప్రధాన లాకు వద్ద నావిగేషన్ ఛాంబర్ తలుపులు పాడై పోవడంతో నీరు లీకై వచ్చినట్లు పి.గన్నవరం జలవనరుల శాఖ అధికారి డీఈఈ వెంకటేశ్వరరావు వివరించారు.
ఇవీ చదవండి: