Damaged roads: అడుగుకో గుంతతో అధ్వానంగా కనిపిస్తున్న ఈ ఫొటోల్లోని రహదారి.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట నుంచి తాపేశ్వరం మీదుగా ద్వారపూడి వెళ్లే మార్గం. ఈ దుస్థితి చూసి దీన్ని వాడకుండా వదిలేశారని అనుకుంటే పొరపాటే..! ఎందుకంటే దీన్ని గతేడాదే రూ.50లక్షలు వెచ్చించి బాగు చేశారు. అయినప్పటికీ ఇలా మారిందంటే పనులు ఎలా చేశారో అర్థం చేసుకోవచ్చు.
ఎండలు కాస్తే.. దుమ్ముతో, వానలు కురిస్తే బురద గుంతలతో వాహనదారుల సహనానికి పరీక్షపెడుతోంది. మండపేట నుంచి జడ్.మేడపాడు వంతెన వరకు 5 కిలోమీటర్ల మేర ప్రయాణం వాహనదారులకు సవాలుగా మారింది. ఈ మార్గంలో వెళ్లే వాహనాలు ఒక్క ట్రిప్పుకే షెడ్డు బాటపడుతున్నాయి. కొన్నయితే ఆ బురదలోనే మొరాయిస్తున్నాయి. ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.
ఈ నెల 9న ఆర్టీసీ బస్సు ఓ వైపు ఒరిగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఒక లారీ కమాన్ కట్టలు జారిపోయి.. ఆగిపోయింది. దాని వెనకాలే కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు జేసీబీతో లారీని నెట్టాల్సి వచ్చింది. మంగళవారం ఇదే మార్గంలో తన వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రహదారి దుస్థితి చూసి కనీసం గుంతల్లోని నీరు బయటికి వెళ్లేలా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
రోడ్డు దుస్థితిపై ర.భ.శాఖ ఏఈ సూర్యనారాయణరావు వివరణ కోరగా ‘సెంట్రల్ రోడ్డు ఫండ్(సీఆర్‌ఎఫ్) కింద రూ.25 కోట్లు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియా పూర్తయింది. వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తాం’ అన్నారు.
ఇవీ చూడండి: