CROP INSURANCE: కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో వెలుగుచూసిన అవినీతి సంచలనంగా మారింది. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వమిచ్చే పరిహారం, బీమా డబ్బులు.. సంబంధం లేని వ్యక్తుల ఖాతాల్లో జమకావడం.. అన్నదాతల్లో ఆందోళనకు దారితీసింది. ఆలమూరుకు చెందిన పలువురు రైతులకు చెందాల్సిన పరిహారం, బీమా డబ్బులు.. ఖాతాలు మారాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు.. తెలుగుదేశం పార్టీ నేత, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో.. రైతులు ఆలమూరులోని వ్యవసాయశాఖ కేంద్రాన్ని ముట్టడించారు. గ్రామంలోని రైతుల సర్వే నెంబర్లు పరిశీలించగా.. వారికి రావాల్సిన డబ్బు అధికార పార్టీ నాయకుల ఖాతాల్లోకి చేరిందని తేలింది. ఆలమూరు రైతులకు దక్కాల్సిన బీమా మొత్తాలు.. సూర్యారావుపేటలోని సర్పంచ్ భర్త, వాలంటీర్, అతడి కుటుంబసభ్యులు, కొందరు అధికార పార్టీ కార్యకర్తల బ్యాంకుల్లో జమయ్యాయి.
సూర్యారావుపేటకు చెందిన 17 మంది వ్యవసాయానికి సంబంధం లేని వ్యక్తుల ఖాతాల్లో 10 లక్షల 87 వేల 362 రూపాయల పరిహారం సొమ్ము జమయినట్లు గుర్తించారు. సూర్యారావుపేట సర్పంచి భర్త నాగేశ్వరరావు పేరు మీద 88 వేల 530, గ్రామ వార్డు సభ్యురాలి భర్త పేరు మీద 19 వేల 986, వాలంటీర్ పేరు మీద 14 వేల 966 రూపాయలు జమయ్యాయి. మరికొందరు వైకాపా కార్యకర్తలకూ నగదు జమ అయ్యిందని రైతులు వాపోయారు. తమకు చెందాల్సిన పరిహారాన్ని వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులకు వెంటనే న్యాయం చేయకపోతే.. ఉద్యమిస్తామని.. తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు. ఘటనపై విచారణ జరిపి నిజానిజాలు తేలుస్తామని.. వ్యవసాయ అధికారి చెప్పారు. అక్రమాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, తెలుగుదేశం నేతలు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: