CM Jagan Visited Godavari Flood Affected Areas: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత రెండు రోజులుగా గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి రోజు (సోమవారం) అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్టలో పర్యటించిన జగన్.. పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. రెండవ రోజు (మంగళవారం) కోనసీమ జిల్లాలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా గోదావరి వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఈ నెలాఖరులోపే పరిహారం అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈనెలాఖరులోపే పరిహారం అందిస్తాం.. గోదావరి వరదతో పంటలు నష్టపోయిన రైతులకు ఈనెలాఖరులోపే పరిహారం అందిస్తామని.. సీఎం జగన్ అన్నారు. నేడు కోనసీమ జిల్లాలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను పరామర్శించారు. అనంతరం సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు. భూమి కోతకు గురవకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. మూడున్నర కిలోమీటర్ల మేర రక్షణగోడ నిర్మిస్తామని పేర్కొన్నారు. రాబోయే రెండు నెలల్లోనే ఆ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
పశువులకు ఇబ్బంది రాకుండా చూసిన ప్రభుత్వం మాదే.. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు పర్యటించిన సీఎం జగన్.. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను పరిశీలించారు. ముందుగా కూనలంక చేరుకున్న సీఎం.. బాధితులను పరామర్శించారు. వరద ప్రారంభమైనప్పటి నుంచే ముందు జాగ్రత్తలు తీసుకున్నామన్నామని,.. అన్ని జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బందిని సైతం వరద ప్రాంతాల్లో మోహరించి.. సహాయ చర్యలు అందించామని జగన్ వెల్లడించారు. వరదల సమయంలో నిత్యావసరాలు, మంచినీటి సమస్యలు తలెత్తకుండా చూశామన్నారు. పశువులకు సైతం ఇబ్బంది తలెత్తకుండా చూసిన ప్రభుత్వం తమదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
ఫొటోల్లో, టీవీల్లో కనిపించేందుకు హడావుడి చేసేవారు.. గతంలో వరద వచ్చిందంటే కేవలం ఫొటోలు, టీవీల్లో కనిపించేందుకు హడావుడి చేసేవారన్న సీఎం.. తమ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా పని చేసిందన్నారు. అధికారులకు సూచనలు చేసి, సహాయ చర్యలను పర్యవేక్షించామన్నారు. వారం రోజులు గడువిచ్చి ఆలోపే పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలని తాను అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. తన మొదటి రోజు పర్యటనలో బాధితులను అడిగి సహాయ కార్యక్రమాలపై ఆరా తీశానన్న సీఎం జగన్.. ప్రభుత్వం, అధికారులపై అందరూ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.
దెబ్బతిన్న పంటలకు నష్టాన్ని అందజేస్తాం.. వర్షాలు పడిన సమయంలో వరదలు ముంచెత్తిన కారణంగా రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారని సీఎం జగన్ గుర్తు చేశారు. వరదలతో దెబ్బతిన్న పంటలకు నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి.. ఆ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. ఆ తర్వాత వివరాలను ఆర్బీకేల్లో సోషల్ ఆడిట్ కోసం అందుబాటులో ఉంచుతామన్న సీఎం.. పేర్లు లేనివారు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు. అన్నీ పూర్తి చేసి ఈ నెలాఖరులోపే పరిహారాన్ని అందిస్తామని హామీ రైతులకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.
మూడున్నర కిలోమీటర్లు రక్షణగోడ నిర్మిస్తాం.. ఆ తర్వాత అయినివిల్లి మండలం కొండకుదురులంకలో సీఎం జగన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా వరద ముంపు బాధితులతో మాట్లాడారు. సహాయ కార్యక్రమాలు బాగున్నాయన్న ప్రజలు.. వరద సమయంలో సత్వరమే ఆదుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వరదలు వచ్చినప్పుడుల్లా లంక గ్రామాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయన్న సీఎం.. భూమంతా కోతకు గురవుతోందన్నారు. దీనికి శాశ్వత పరిష్కారంగా మూడున్నర కిలోమీటర్ల మేర రక్షణ గోడను నిర్మిస్తామన్నారు. అందుకు సంబంధించిన పనులను రెండు నెలల్లోనే ప్రారంభిస్తామన్నారు. ఆ రక్షణగోడ నిర్మాణానికి నిధులను విడుదల చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రక్షణగోడకు సంబంధించిన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులు, మంత్రులకు సూచించిన సీఎం.. త్వరితగతిన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.