Floods in yanam: తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం బ్యారేజీ నుండి 25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడంతో గౌతమి గోదావరి నది ఉగ్రరూపంలో ప్రవహిస్తోంది. గోదావరి నది పరివాహక ప్రాంతమైన కాకినాడ జిల్లాలో.. అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత యానాం మునుపెన్నడూ లేని విధంగా ముంపు బారిన పడింది. భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న ఎనిమిది గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుములోతు నీరు చేరింది.
గూడుచెదిరిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇల్లు వదిలి బయటకు వస్తే విలువైన సామాగ్రి దొంగల పాలవుతుందని.. ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లటం లేదు.
వరద ముంపు బారిన పడిన 1500 కుటుంబాలకు పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆర్ధిక సహకారంతో.. యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉదయం భోజనం అందిస్తున్నారు. వరద ప్రభావం మరో మూడు రోజులపాటు కొనసాగే పరిస్థితి ఉండటంతో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
యానాంకు వరద ప్రభావంతో కలిగిన నష్టాన్ని.. ప్రజల పడుతున్న ఇబ్బందులను పుదుచ్చేరి గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కు ముఖ్యమంత్రి రంగస్వామి వివరించారు. ప్రభుత్వం తక్షణ సాయంగా.. ప్రతి కుటుంబానికి రూ.5 వేలు అందించాలని కోరినట్లు తెలిపారు.