ఆ ఆమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ఏడాదిపాటు కలిసి తిరిగారు. పెళ్లి అనేసరికే యువకుడు మొహం చాటేశాడు. ప్రేమించే ముందు అడ్డురాని ఆమె రంగు...పెళ్లి అనగానే గుర్తుకొచ్చినట్లుంది. నల్లగా ఉన్నావ్ వద్దన్నాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే మరో యువతితో వెళ్లిపోయాడు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు వెనక్కు తీసుకోవాలని బెదిరించినట్లు యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతి కుటుంబ సభ్యుల వివరాల మేరకు..
బాపట్ల మండలానికి చెందిన ఓ యువతి, ఫ్రాన్సిస్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఏడాదిపాటు సన్నిహితంగా తిరిగారు. పెళ్లి చేసుకుందాం అనే సరికే నల్లగా ఉన్నావు చేసుకోను అన్నాడు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆ యువతి గతవారం ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మరో యువతితో జంప్..
అయితే గ్రామస్తుల జోక్యంతో ఫ్రాన్సిస్ పెళ్లికి ఒప్పకున్నాడు. అంతలోనే (యువతి ఆసుపత్రిలో ఉండగా) అదృశ్యమయ్యాడు. ఆరా తీయగా మరో యువతితో వెళ్లిపోయినట్లు తేలింది.
యువతి కుటుంబీకులకు బెదిరింపులు
దీంతో ఆవేదన చెందిన యువతి కుటుంబ సభ్యులు.. బాపట్ల గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఫ్రాన్సిస్ శుక్రవారం తెల్లవారుజామున మరో ఇద్దరితో కలిసి యువతి ఇంటికి వెళ్లాడు. కేసు వెనక్కు తీసుకోవాలని బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఇంటి ముందు ఉన్న పాకకు నిప్పుపెట్టాడు.
ఫ్రాన్సిస్ కోసం గాలింపు
బాధితురాలి తల్లిదండ్రులు మరోసారి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఫ్రాన్సిస్ నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెదుళ్లపల్లి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఫ్రాన్సిస్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి..