నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతంలో వాటి కదలికలకు మనుషుల రాకపోకలు ఇబ్బందిగా ఉన్నందున.. అక్కడి గిరిజనులు స్వచ్ఛందంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లేలా ప్రోత్సహించాలని కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి ప్రకాశ్ జావడేకర్ సూచించారు. టైగర్ డే సందర్భంగా మంగళవారం దిల్లీలో ఆయన కేంద్ర పులుల నివేదికను విడుదల చేశారు. ఆ నివేదికలోని వివరాల ప్రకారం.. ఏపీలో మొత్తం 48 పులులున్నాయి. 24 గిరిజన గ్రామాల మధ్య విస్తరించిన నాగార్జునసాగర్- శ్రీశైలం సంరక్షణ ప్రాంతంలోనే 43 ఉన్నాయి. మిగతా రాష్ట్రాలకంటే మధ్యప్రదేశ్, ఏపీలలో పులులు తిరిగే ప్రాంతం పెరిగింది.
* నాగార్జునసాగర్- శ్రీశైలం సంరక్షణ ప్రాంతంలో మనుషుల రాకపోకలు తక్కువగా ఉన్నందున పులులకు సురక్షితంగా ఉంది. ఇక్కడ 4,687 చ.కి.మీ. విస్తీర్ణంలో 38 పులులున్నట్లు తేలింది.
* 2014లో రూపొందించిన అంచనాలతో పోలిస్తే పులుల సాంద్రతలో పెద్ద మార్పేమీ లేదు. పులులకు ఆహారమయ్యే జంతువులు అరుదుగా కనిపించాయి. ఈ జంతువుల సంఖ్య పెరగడంపైనే పులుల ఆరోగ్యం, అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
* నాగార్జునసాగర్- శ్రీశైలం సంరక్షణ కేంద్రం శేషాచలం జంతుసంరక్షణ కేంద్రానికి అనుసంధానమై ఉంది. పులుల రాకపోకలకు అతి ముఖ్యమైన ఈ కారిడార్ రక్షణకు ప్రాధాన్యమివ్వాలి.
* శేషాచలం బయోస్పియర్ రిజర్వ్‌లో 8 పులులను గుర్తించారు. ముఖ్యంగా నాగార్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో 2 కి.మీ.పరిధి పులుల ఆవాసానికి అనువుగా ఉంది.
* గుండ్లబ్రహ్మేశ్వరం, శ్రీలంకమల్లేశ్వరం, శ్రీ పెనుశిల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలగుండా నాగార్జునసాగర్- శ్రీవేంకటేశ్వర కారిడార్ సాగుతుంది. రాష్ట్ర రహదారులు కొన్ని ఈ కారిడార్ గుండా ఉన్నందున అక్కడక్కడ వన్యప్రాణులకు అనువైన మార్గాలను నిర్మించాలి.
* పులులు అంతరిస్తున్న అటవీ ప్రాంతాల జాబితాలో రాష్ట్రంలోని శోభనాద్రిపురం, దేవరాపల్లి, కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
* మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో పులులు తిరిగేచోట 67,576 చ.కి.మీ. విస్తీర్ణంలో అడవి కుక్కలూ కనిపించాయి. అమ్రాబాద్, నాగార్జునసాగర్- శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం, శ్రీవేంకటేశ్వర వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ప్రాంతాల్లో ఎలుగుబంట్లు ఉన్నాయి.
ఇవీ చదవండి...