భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో... భార్య మేనమామ ప్రాణాలు బలిగొన్నాడు ఓ కిరాతకుడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన వేముల యాదమ్మ కుమార్తె శ్రీదేవికి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఆరెపడి సుజైరాజుతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. భర్త సరిగా చూసుకోవడం లేదని శ్రీదేవి ఈ నెల 18న తల్లిగారింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు సుజైరాజు గురువారం వచ్చి వెళ్లాడు. మళ్లీ శుక్రవారం వచ్చి భార్యను పంపమని అడగ్గా... వివాదం పరిష్కారమయ్యాకే పంపుతామని అతనికి అత్తింటి వారు చెప్పారు.
అనంతరం తన చిన్న కూతురిని కారులో ఎక్కించుకొని వెళ్తున్న సుజైరాజుకు శ్రీదేవి మేనమామ గుంజ శంకర్ అడ్డుపడ్డారు. కారు బానెట్‌పై ఉన్న ఆయనను అలాగే హుజూర్‌నగర్ రోడ్డు నుంచి జాన్‌పహాడ్ రోడ్డువైపు తీసుకెళ్లి కిందపడేసిన సుజైరాజు... కారుతో తొక్కించాడు. తీవ్రంగా గాయపడ్డ శంకర్‌ను ఆసుపత్రికి తరలించేసరికి మృతి చెందారు. శంకర్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి... నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.