అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని.. తెదేపా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. పోలీసుల అండతో తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన ఏడుగురు తెదేపా నేతలను తక్షణమే విడుదల చేయాలంటూ.. న్యాయవాదులతో కలిసి వెళ్లి అరండల్పేట సీఐకి వినతి పత్రం అందజేశారు. కేసులతో సంబంధం లేని వ్యక్తులను స్టేషన్కి పిలిపించి.. నాలుగు రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
కార్పొరేషన్ ఎన్నికలకు ముందు రోజు.. 50వ డివిజన్లో వైకాపా నేతలు విచ్చలవిడిగా నగదు పంపిణీ చేశారని శ్రావణ్ కుమార్ తెలిపారు. దానిని అడ్డుకున్న తెదేపా అభ్యర్థి, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడులు చేశారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. డబ్బులు పంచిన వారిని వదిలేసి అడ్డుకున్న తెదేపా మద్దతుదారులను అరెస్ట్ చేశారని చెప్పారు. ఆ కేసు నిలబడదని తెలిసి.. ఏడుగురు కార్యకర్తలపై చోరీ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వారి తరపున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తరువాత పోలీసులు స్పందించి.. అరెస్ట్ చేసిన వారిని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. వైకాపా నేతలు తగిన మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: