Sanitation workers are begging in AP: మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులు రోజూ పరిశరాలను శుభ్రం చేయాల్సిందే.. అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ఇలాకాలో అన్యాయం జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతం చెల్లించడం లేదు. చాలీచాలని వేతనాలతో బతకడమే కష్టమైన కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు.
వారంతా రాజధాని ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఇస్తున్న జీతం కేవలం 12వేల రూపాయలు. పీఎఫ్, ఈఎస్ఐ కటింగ్లు పోగా.. వారి చేతికి కేవలం 10వేల రూపాయలు మాత్రమే అందుతున్నాయి. ఆ జీతాలతో తమ కుటుంబాలను పోషించడమే కష్టమైతే.. ఇచ్చే జీతం సకాలంలో ప్రభుత్వం చెల్లించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. తామంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలమని.., నెలలు తరబడి వేతనాలు చెల్లించకపోతే తమ బిడ్డలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు చేశామని, అలాంటి తమకు ప్రభుత్వం సమయానికి జీతాలు ఇవ్వక రోడెక్కే విధంగా చేసిందని పారిశుద్ధ్య కార్మికులు వాపోతున్నారు.
జీతాలు సరైన సమయానికి అందక తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ పని చేస్తుంటే.. వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రస్తతం ఉన్న కాంట్రాక్టర్... కాంట్రాక్ట్ అయిపోతుందని.. తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని భావోద్వేగానికి గురవుతున్నారు. తమను ఉన్న ఫళంగా పని నుంచి తొలగిస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. నెలల నుంచి పెండిగ్లో ఉన్న జీతాలు విడుదల చేయకపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయంటున్నారు. తాము అనేక విధాలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికే అనేక విధాలుగా వారి నిరసన తెలిపినా.. తమ సమస్యలు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించలేదని మండిపడుతున్నారు.
'తమ చేతికి కేవలం 10వేల రూపాయలు మాత్రమే. ఆ జీతాలతో తమ కుటుంబాలను పోషించడమే కష్టమైతే.. ఇచ్చే జీతం సకాలంలో ప్రభుత్వం చెల్లించడం లేదు. తామంతా రెక్కాడితే గానీ డొక్కాడని పేదలం.. నెలలు తరబడి వేతనాలు చెల్లించకపోతే తమ బిడ్డలను ఎలా పోషించుకోవాలి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించి ప్రజలకు సేవలు చేశాం'.- రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మికులు.
ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు రావాల్సిన బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. లేకపోతే తమ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: