గుంటూరు జిల్లా మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామానికి చెందిన గంగవరపు చిన్న నాగేశ్వరరావు(58) స్థానికంగా ఉన్న టెంట్‌హౌస్ దుకాణంలో పనిచేస్తుంటాడు. ఈయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం అయ్యింది. కుమారుడు కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు. గురువారం సాయంత్రం చిన్న నాగేశ్వరరావు.... తన ద్విచక్రవాహనంపై యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ పరిధిలోని పొలాల వైపు వెళ్ళాడు.
తాను చనిపోతున్నట్లు.. రోడ్డుపై పెట్టిన ద్విచక్ర వాహనాన్ని తీసుకెళ్లాలని తన అన్న కుమారుడు రాముకు ఫోన్ ద్వారా తెలిపాడు. అతను వారించే లోపే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అన్న కుమారుడితో పాటు గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లేసరికి నాగేశ్వరరావు నిర్జీవ స్థితిలో కనిపించాడు. కాలిపోయి పడి ఉన్న మృతదేహాన్ని చూసి వారు కన్నీటిపర్యంతమయ్యారు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే చిన్న నాగేశ్వరరావు ఆత్మాహుతికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి: