గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ పాఠశాలల ఆవరణలోనే ప్రాథమిక పాఠశాల ఉన్న స్కూల్లో నూతన విద్యా విధానం అమలు చేయటానికి అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. అందుకు ఎంపిక చేసిన చిలకలూరిపేట మండలం మురికిపూడి, యడ్లపాడు మండలం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల (ఉర్దూ)లను గురువారం పాఠశాల విద్యా శాఖ కమిషనర్ చిన వీరభద్రుడు పరిశీలించారు. ఆయా పాఠశాలలో కల్పించాల్సిన వసతులు, అదనపు తరగతి గదుల ఏర్పాటుపై చర్చించారు.
ఎంపిక చేసిన జిల్లాలోని మూడు ఉన్నత పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి 3,5 తరగతుల విద్యార్థులను సంసిద్ధం చేసేలా చిన్న వీరభద్రుడు సూచనలు చేశారు. మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నత పాఠశాలలలోనే బోధన చేసేందుకు ప్రణాళిక, అవసరమైన అదనపు తరగతి గదులు ఏర్పాటు, వసతులు కల్పించేలా చూడాలని ఆదేశించారు. అందుకు అవసరమైన ఉపాధ్యాయులను ఎంపిక చేయాలన్నారు. ఏ పాఠశాల మూతపడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ దేవానంద రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు సుబ్బారెడ్డి, ప్రతాపరెడ్డి, రవీంద్రనాథ రెడ్డి, మువ్వా రామలింగం తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి