Bail Granted to Aadireddy Apparao: జగజ్జనని చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు, డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ నమోదు చేసిన కేసులో ఇద్దరికీ షరతులతో బెయిలు మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అభియోగపత్రం దాఖలు చేసే వరకు ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు తమ పరిధిలోని ఠాణాలో హాజరుకావాలని స్పష్టంచేశారు.
50 వేల వ్యక్తిగత బాండ్‌తో ఒక్కొక్కరు రెండు పూచీకత్తులు సమర్పించాలన్నారు. చిట్ సహాయ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 30న అప్పారావు, శ్రీనివాస్‌ను సీఐడీ అరెస్టు చేయగా.. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. పిటిషనర్లను అరెస్టు చేయవద్దని ఈ ఏడాది మార్చిలో హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని.. పైగా ఇద్దరూ ఇప్పటికే దర్యాప్తునకు సహకరించారని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు వయసు 70 ఏళ్లని గుర్తుచేసిన న్యాయమూర్తి.. పిటిషనర్లను ఇంకా రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
C.I.D లోపాలను న్యాయమూర్తి ఎత్తిచూపారు. జగజ్జనని తమ సొమ్ము చెల్లించలేదని ఏ ఒక్క చందాదారుడి నుంచీ ఫిర్యాదు లేదని గుర్తుచేశారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించారంటూ సాధారణ ఆరోపణలు చేయడమే తప్ప... వాటికి బలం చేకూర్చే ఆధారాలు ఏమీ లేవన్నారు. చందాదారులకు సొమ్ము తిరిగి చెల్లించకుండా అధిక వడ్డీ ఆశచూపి, ఆ సొమ్మును పిటిషనర్ల వ్యాపారాల్లోకి మళ్లించారని C.I.D పేర్కొందని.. ఈ విషయంలో ఆరోపణ తప్ప సంబంధించిన ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదని తెలిపారు. చందాదారులకు సొమ్ము చెల్లించడంలో విఫలమయ్యారని ఒక్కరూ ఫిర్యాదు చేసినట్లు కనిపించడం లేదని... అయినా చిట్ సహాయ రిజిస్ట్రార్ పిటిషనర్లపై సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు.
చిట్ వ్యాపారంలో సమస్య తలెత్తితే రిజిస్ట్రార్ వద్ద మధ్యవర్తిత్వానికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఈ వ్యవహారాన్ని చిట్ రిజిస్ట్రార్ వద్దకు సిఫారసు చేయాల్సిన సహాయ చిట్ రిజిస్ట్రార్..... జగజ్జనని అధిక వడ్డీ ఆశచూపి డిపాజిట్లు సేకరిస్తోందని ఆరోపిస్తూ నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. ఒకవేళ చిట్ రిజిష్టర్‌లో సొమ్ము చెల్లింపు తేదీల్లో తేడాలు ఉన్నాయని అనుకున్నా.. పుస్తకాల్లో తప్పుగా నమోదు చేయడం I.P.C సెక్షన్ 409, డిపాజిటర్ల చట్టం సెక్షన్ 5 కిందకు రాదని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నట్లు న్యాయమూర్తి స్పష్టం చేశారు.
హైకోర్టు బెయిలు మంజూరు చేసినా దానికి సంబంధించిన పత్రాలు సరైన సమయంలో రాజమండ్రి కేంద్ర కారాగారం అధికారులకు అందలేదు. అందువల్ల ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ విడుదల వాయిదా పడింది. బెయిల్‌కు సంబంధించిన పత్రాలు అందగానే విడుదల చేస్తామని జైలు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: