Delaying Payment For Pending Bills: గుత్తేదారులంటే ఒకప్పుడు వాళ్లకేం అనే భావన ఉండేది. ఇప్పుడు వారిపై ప్రతిఒక్కరూ జాలిపడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. గుత్తేదారులకు ఎదురొచ్చి అప్పులిచ్చే మెటిరీయల్ సరఫరాదారులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక, అప్పులు కట్టలేక ఉక్కిబిక్కిరవుతున్నారు. కోర్టు మెట్లెక్కితే తప్ప ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని వాపోతున్నారు.
సాధారణంగా ఏ ప్రభుత్వంతోనూ గుత్తేదారులు గొడవ పెట్టుకోవాలనుకోరు. వీలైనంత సామరస్యంగా వెళ్తూ చేసిన పనులకు, బిల్లులు మంజూరు చేయించుకునేందుకే ప్రయత్నిస్తారు. చెల్లింపులు జాప్యమైతే మంత్రులతోనే, అధికారపార్టీ పెద్దలతోనే సిఫార్సులు చేయించుకొని త్వరగా సొమ్ము రాబట్టుకునేవారు. జగన్ ప్రభుత్వంలో తలకిందులుగా తపస్సుచేసినా, బిల్లులు మంజూరు చేయడంలేదు. నెలలు, సంవత్సరాల తరబడి నిరీక్షించి, నీరసించి, సహనం నశించి చివరకు కాంట్రాక్టర్లు కోర్టుమెట్లెక్కుతున్నారు. దాదాపు రూ.800 కోట్లరూపాయల బకాయిల కోసం గుత్తేదారులు హైకోర్టులో కేసులు వేశారంటే పరిస్థితి వాళ్ల పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఏ ప్రభుత్వంలోనూ ఇటువంటి దౌర్భాగ్యకరమైన దుస్థితిలేదని గుత్తేదారులు వాపోతున్నారు.
పాత గుత్తేదారు సంస్థకే పోలవరం పనులు...
అధికారపార్టీ నేతలు, ఇంజినీర్ల మాటలు నమ్మి రోడ్లు, వంతెనల పనులు చేసిన గుత్తేదారులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. రోడ్లపై గుంతలు పూడ్చడం, ఇతర నిర్వహణ పనులు బిల్లులు మహా ఉంటే లక్షల్లోనే ఉంటాయి. ఆ బిల్లుల్నీ ఇవ్వడంలేదు. గతంలో కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో కోర్టులూ ప్రభుత్వానికి అక్షింతలు వేశాయి. కోర్టులు గడువులు పెట్టడంతో ప్రభుత్వం విధిలేక ఆగమేఘాలపై చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు గుత్తేదారులు ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. కొద్ది నెలలుగా హైకోర్టు గడపతొక్కే కాంట్రాక్టర్ల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం రూ.800 కోట్ల మేర బిల్లుల చెల్లింపుల కోసం హైకోర్టులో కేసుసలుంటే అందులో కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్‌ఐఎఫ్), అత్యవసర మరమ్మతులు, రోడ్ల వార్షిక నిర్వహణ పనులు, వంతెనల పనులు వంటివి చేసినవారికి ఇవ్వాల్సిన బిల్లులే 700 కోట్ల వరకూ ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలోని వివిధ పనులు చేసిన గుత్తేదారులు రూ.100 కోట్ల మేర బకాయిల కోసం కేసులు వేశారు. ఇందులో ఎక్కువగా ఆసియా మౌలిక వసతుల పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ) రుణంతో చేపట్టిన రహదారుల పనులు చేసిన గుత్తేదారులే ఉన్నారు. ఇంకా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన మరో రూ.500 కోట్ల మేర బిల్లుల కోసం మరికొందరు కేసులు వేసేందుకు సిద్ధమౌతున్నారు.
త్వరగా పీహెచ్సీ భవనాలు నిర్మించండి సారూ.. అనారోగ్యంతో బాధపడుతున్నాం..
గుత్తేదారులు కోర్టులో వేసిన కేసులను కోర్టు ధిక్కారం కిందకు వచ్చేవి, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఉన్నప్పటికీ బిల్లు చెల్లించనివి, ఇంకా బీఆర్‌వో లేనివి, రిట్ పిటిషన్లు, వాటికి కోర్టు ఆదేశాలు ఇలా మొత్తం ఆరు రకాలుగా పరిగణించి, ఆర్థికశాఖకు సమాచారం ఇస్తున్నారు. ఇందులో వెంటనే బిల్లులు చెల్లించాలని, లేకపోతే సంబంధిత శాఖతోపాటు, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హైకోర్టు ఆదేశాలు ఉన్న కేసులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని భావించి అటువంటి కేసులు తదుపరి విచారణ జరగబోయే తేదీలోపు డబ్బు చెల్లిస్తున్నారు. బుద్ధి తక్కువై ఈ ప్రభుత్వంలో పనులు చేశామని కాంట్రాక్టర్లు లెంపలేసుకునే పరిస్థితి నెలకొంది.
Contractor Questioned MLA: పెండింగ్ బిల్లులపై గుత్తేదారు ప్రశ్నలు.. మౌనం వహించిన ఎమ్మెల్యే