Chandrababu on YSRCP : రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు పంటలు నష్టపోతున్నా వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టింపు లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌ను తిట్టే పని కాకుండా.. రైతుల కష్టాలను చూడాలని వైసీపీ నేతలకు, ప్రభుత్వానికి సూచించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఆడిపోసుకోవటం పక్కన పెట్టి.. మిర్చి రైతుల బాధలను వినాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
వైసీపీ నాయకులు ప్రతిపక్ష నేతల అరెస్టులు, వారిపై దాడులు వంటి వాటిని వదిలి.. అన్నదాతల దుస్థితిపై దృష్టి పెట్టాలన్నారు. వైసీపీ మంత్రులలో కనీసం ఒక్కరు కూడా ఏ ఒక్క చోట.. రైతుల దగ్గరకు వెళ్లలేదని మండిపడ్డారు. కనీసం అన్నదాత కష్టాలపై ఆరా తీయడం లేదని విమర్శించారు. ఇక ముఖ్యమంత్రి సంగతి సరేసరి అని ఎద్దేవా చేశారు. వర్షం కారణంగా నష్టాలను చవి చూసిన కర్షకులకు భరోసా ఇచ్చి.. ప్రభుత్వం నుంచి వారికి తగిన సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి కార్యక్రమంలో రజనీకాంత్ పాల్గొన్నారని.. ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారని చంద్రబాబు అన్నారు. దీనిపై వైసీపీ నేతలు అసభ్యకర విమర్శలతో దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. సమాజంలో ఎంతో గౌరవం ఉన్న రజనీకాంత్ లాంటి వ్యక్తులపై.. అధికార పార్టీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన విమర్శ చేయలేదని.. కనీసం ఏ ఒక్క వైసీపీ నేతను చిన్న మాట కూడా అనలేదని గుర్తు చేశారు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలను మాత్రమే పంచుకున్నారని తెలిపారు. అయిన సరే వైసీపీ నేతలు అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరని పేర్కొన్నారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీపై వైసీపీ నేతల విమర్శలు అకాశంపై ఉమ్మి వేయడమే అని ఎద్దేవా చేశారు. నోటి దురుసు నేతలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదుపులో పెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ఇంతవరకు జరిగిన దానికి క్షమాపణ చెప్పి వైసీపీ నేతలు తమ తప్పు సరిదిద్దుకోవాలని హితవు పలికారు.
ఇవీ చదవండి :