Book on Director of State Audit Hari prakash: రాష్ట్రస్థాయి అధికారి అయిన స్టేట్ ఆడిట్ డైరెక్టర్ ఆర్.హరిప్రకాశ్ వేధింపులపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన వేధింపులు, అక్రమాలు, నమోదైన అభియోగాలతో పాటు పెద్దఎత్తున ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించి 600 పేజీల పుస్తకాన్ని పంపిణీ చేశారు. గడిచిన ఏడాది కాలంగా ఆయన వేధింపులపై ఆందోళనలు, నిరసనలు, విజ్ఞాపనలు చేపట్టిన ఉద్యోగులు.. ఏకంగా ఓ పుస్తకాన్నే అచ్చు వేయించి పంపిణీ చేశారు.
వివిధ క్రిమినల్ కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నా.. శాఖాపరమైన విచారణలో ఆయనపై నమోదైన అభియోగాలు నిజమని నిర్ధారణ అయినా.. ఆర్. హరిప్రకాశ్‌ను స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌గా రాష్ట్రప్రభుత్వం కొనసాగించటంలో అర్ధం ఏమిటని ఆడిట్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 2012లో తిరుపతిలో అకౌంట్స్ ఎగ్జామినర్‌గా ఉన్నప్పటి నుంచే హరిప్రకాశ్‌పై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చినా.. అభియోగాలు నమోదైనా.. రాజకీయ ఒత్తిళ్లతో స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌గా కొనసాగిస్తున్నారని.. ఆడిట్ విభాగం ఉద్యోగులు ఆక్షేపిస్తున్నారు.
అక్రమంగా సంపాదించిన డబ్బుతో తిరుపతిలోని రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో పెద్ద ఎత్తున భూములు, ఆస్తులు కొనుగోలు చేశారని పేర్కొంటూ.. ఆధారాలతో సహా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, నగదు చెల్లింపు రసీదుల నకళ్లను ఆ పుస్తకంలో ఆడిట్ ఉద్యోగులు పొందుపరిచారు.
తిరుపతిలోని స్టేట్ ఆడిట్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఆయన రేణిగుంట సమీపంలోని చెంగారెడ్డిపల్లెలో అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా 21 ఎకరాల మేర భూమి కొనుగోలు చేసిన పత్రాలను.. ఆయన ఖాతాకు ఓ ఎన్నారై నుంచి 70 లక్షల రూపాయల నిధులు జమ అయిన రశీదులనూ పొందుపరిచారు.
ఈ వ్యవహారంపై నమోదైన ఫిర్యాదులపై ప్రభుత్వం చేసిన శాఖాపరమైన విచారణలోనూ ఆయనపై ఈ అభియోగాలు నిజమని నివేదికలో తేలిందన్నారు. ఇన్ని ఉన్నా ఆయన్ను స్టేట్ ఆడిట్ డైరెక్టర్ గా కొనసాగించటంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఆడిట్ డైరెక్టర్‌గా ఉండి తన పేరుతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని.. ఇది నిబంధనలకు విరుద్ధమని.. ఉద్యోగులు తెలిపారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లోనూ డబ్బులు తీసుకునే.. ఇష్టానుసారం చేశారని ఆరోపించారు. జిల్లాల విభజన జరిగినా ఆర్డర్ టూ సర్వ్ పేరిట ఉత్తర్వుల మేరకు సీనియారిటీ పాటించకుండా కావాల్సిన వారికే బదిలీలు చేశారన్నారు.
అదే సమయంలో పాత జిల్లాల్లోని జిల్లా ఆడిట్ అధికారులను ఇష్టానుసారంగా కావాల్సిన వారినే ఇంఛార్జులుగా నియమించుకున్నారని ఆరోపించారు. ఆయన వ్యవహారాలపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, సలహాదారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని.. అధికార పార్టీకి అనుకూలమైన అధికారిగా ఉన్నందునే ప్రభుత్వం ఆయనను కొనసాగిస్తోందంటూ ఆడిట్ ఉద్యోగులు తప్పుబట్టారు.