జై అమరావతి నినాదం రాజధాని గ్రామాల్లో మార్మోగింది. 200వ రోజూ రైతులు ఉద్యమించారు. తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని రాజధాని గ్రామాల్లో మహిళలు, రైతులు భౌతికదూరం పాటిస్తూ ఆందోళనలు నిర్వహించారు. వారి ఆందోళనకు మద్దతుగా వైకాపా మినహా అన్ని పార్టీలు ముందుకొచ్చాయి. ఆరేళ్ల పిల్లాడి దగ్గర్నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు ఉద్యమంలో పాల్గొన్నారు.
- వెలగపూడిలో అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నాయకులు ఉద్యమంలో అసువులు బాసిన 71 మంది రైతులకు ఘన నివాళ్లు అర్పించారు. జనసేన, తెలుగుదేశం పార్టీ నేతలు రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో పాల్గొన్న వారికి మద్దతుగా నిలిచారు.
- తుళ్లూరు, మందడంలో రైతులు, మహిళలు నిర్వహించిన ధర్నాలో రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. తుళ్లూరు నుంచి రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రాంతానికి కాలినడకన బయలుదేరిన దళిత ఐకాస నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఐకాస నాయకులు ఉద్ధండరాయుని పాలెంలో ప్రధాని మోదీ, అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం తమను ఎంతగా అణిచివేయాలని చూస్తే అంతగా ఉద్యమిస్తాని నేతలు తేల్చి చెప్పారు.
- అమరావతి పరిరక్షణ ఉద్యమం 200 రోజులు పూర్తయిన సందర్భంగా యువజన ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు రావిపాటి సాయి రాయపూడిలో వినూత్న నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం భావితరాల భవితను అధఃపాతాళంలోకి తొక్కేస్తోందనే సూచికగా కృష్ణా నది ఇసుకలో కూరుకుపోయి నిరసన వ్యక్తం చేశారు.
- రైతులకు మద్దతుగా తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లోనూ రైతులు ధర్నాలు నిర్వహించారు.
- కర్నాటకలోని మాన్వి మండలంలోని రైతులు... అమరావతి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో పాల్గొన్నారు.
అమరావతి ఉద్యమ లక్ష్యం నెరవేర్చేదాకా తమ ఆందోళనలను కొనసాగిస్తామని రైతులు, మహిళలు తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి