గుంటూరు జిల్లాలో కలుషిత ఆహారం తిని 23మంది అస్వస్థతకు గురయ్యారు. కొల్లిపొర మండలం తూములూరులోని ఓ హోటళ్లో అల్పాహారం తీసుకున్న వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో వారందరిని మొదట కొల్లిపొరలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అనంతరం బాధితులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
బాధితులంతా ఉపాధి హామీ కూలీ పనులు చేసేవారే. గురువారం ఉదయం ఉపాధి హామీ పనులు చేసిన తర్వాత... రోడ్డు పక్కనే ఉన్న హోటళ్లో అల్పాహారం చేశారు. కాసేపటికే అస్వస్థతకు గురయ్యారు. కారంపొడితో అల్పాహారం తీసుకున్న వారికి ఏమీ కాలేదు. చట్నీ వేసుకున్న వారు మాత్రమే అస్వస్థతకు గురయ్యారు. దీన్ని బట్టి పాడైపోయిన చట్నీ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు వాటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంకా ఎవరైనా ఆ హోటల్లో ఆహారం తిని ఉంటే ఆసుపత్రికి రావాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో ఓపీ సేవలు పునః ప్రారంభం