జగన్ మాయమాటలు నమ్మిన ప్రజలు ఒక్కఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే అయన్ని గెలిపించారని… యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. చంద్రబాబు పాలన గుప్తుల స్వరయుగంలా ఉంటే… జగన్ పాలన తుగ్లక్ పాలనతో సమానంగా ఉందని దుయ్యబట్టారు.
ఆర్థిక వ్యవస్థను జగన్ అసలు పట్టించుకోవట్లేదని యనమల ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై కనీస అవగాహనలేని వ్యక్తి సీఎంగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దశతోటి అధికారంలోకి వచ్చిన జగన్ కు దిశలేదని మండిపడ్డారు.
ఆనాడు తుగ్లక్ ఆలోచనలకు కూడా ఆర్థికవ్యవస్థ సహకరించలేదని… నేడూ అంతేనని పేర్కొన్నారు. ఏవోకొన్ని కార్యక్రమాలు ప్రజలకు చేశామని చెప్పుకుంటున్నారు తప్ప ఆదాయమార్గాలన్నీ పడిపోయాయని జగన్ పాలనను తూర్పారబట్టారు.
ఆదాయ మార్గాలపై అన్వేషణ లేకపోవటం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు తప్పవన్న యనమల… మాఫీయాలను ప్రోత్సహిస్తూ వ్యవస్థలనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానం తీర్పులను సైతం పట్టించుకోకుండా ఏదైనా చేయవచ్చనే నాయకుడు ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.