TDP Mahanadu program in Rajahmundry: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే మహానాడు కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 27, 28 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగే ఈ మహానాడును చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఈ మహానాడు ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు.
శాస్త్రోక్తంగా భూమి పూజ.. తెలుగుదేశం పార్టీ పండగ.. మహానాడును విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం మహానాడుకు రాజమహేంద్రవరంలో భూమిపూజ నిర్వహించారు. కడియం మండలం వేమగిరిలో జాతీయ రహదారికి ఇరువైపులా నిర్వహించనున్న మహానాడుకు అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు భూమిపూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మాజీ మంత్రులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, కొల్లు రవీంద్ర, జవహర్, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, దేవినేని ఉమా పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, వర్మ, బొండా ఉమా, సత్యానందరావు, రామకృష్ణారెడ్డి, గిడ్డి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న వేళ ఈ సారి మహానాడుకు ఎంతో ప్రత్యేకత ఉందని.. నభూతో నభవిష్యత్ అన్న చందగా నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. 27న 15 వేల మందితో.. ప్రతినిదుల సభ ఏర్పాటు చేశామని.. గతంలో తీర్మానాలకు భిన్నంగా వైసీపీ విధ్వంస పాలన, ఆంధ్రప్రదేశం వినాశానం, అరాచకాలు, అవనీతి, ప్రకృతి సంపద కొల్లగొట్టిన విధానం పైనా తీర్మానాలు చేస్తామని చెప్పారు. 28న 15 లక్షల మందితో మహాసభ నిర్వహిస్తామని అన్నారు. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న తెలుగుదేశం.. దానిని మహానాడు వేదికగా తమకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని భావిస్తోంది.
ఏజెన్సీలను బెదిరించడం సరికాదు.. ఇవాళ ఎంపీ భరత్ పుట్టిన రోజు సందర్భంగా రాజమహేంద్రవరంలో హోర్డింగ్లు మొత్తం తీసుకొని, ఈ నెలాఖరు వరకు తన ఫ్లెక్సీలో ఉండేలా ఏజెన్సీలను బెదిరిస్తున్నారని ఇది సరి కాదని అన్నారు. చంద్రబాబుబు పాలన కోసం ప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని.. ఈ మహానాడు ద్వారా ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా మహానాడు నిర్వహిస్తామని నేతలు కళా వెంకట్రావు, బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప, దేవినేని ఉమా స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ మహానాడుకి రాజమహేంద్రవరంలో ఏక్కడా ఒక్క హోర్డింగ్ కూడా ఉండకూడదని భయపెట్టినట్లు తెలిసింది. ఇటువంటి కవ్వింపు చర్యలు చేస్తే ఈ సారి ప్రజలు తిరగబడతారు. ఎలాంటి పనులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంగా సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆశిస్తున్నాం.- అచ్చెన్నాయుడు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: