తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో వైకాపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని ఆయన అన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా మున్సిపాలిటీలో అభివృద్ధి ఎక్కువ జరిగి ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు.
నాడు పత్ని.. నేడు పతి.. జంటగా ప్రచారం.
ముమ్మిడివరం నగర పంచాయతీలో తెదేపా అభ్యర్థి అశోక్ ప్రచారం చేశారు. ఈయన మాజీ ఛైర్పర్సన్ శాంతకుమారి భర్త. గతంలో తెలుగుదేశం తరపున బరిలో దిగిన శాంతకుమారి చైర్ పర్శన్గా పదవిలో కొనసాగారు. ఈసారి చైర్మన్ పదవి పురుషులకు కేటాయించడంతో ఆమె భర్త అశోక్ పోటీ చేశారు. ఆయన తరుపున తన వంతుగా గ్రామాల్లో తోటి మహిళలతో ప్రచారం నిర్వహిస్తోంది. మరికొన్ని చోట్ల భార్యాభర్తలిద్దరూ కలిసి ఓటర్లను కలిసి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ముమ్మిడివరం పంచాయతీలో పర్యటించిన ఎన్నికల పరిశీలకులు.
ముమ్మిడివరం నగర పంచాయతీలో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను జిల్లా ఎన్నికల పరిశీలకులు అంబేద్కర్ పరిశీలించారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందించేందుకు.. ఎన్నికల అనంతరం తిరిగి వాటిని తీసుకునేందుకు చేయవలసిన ఏర్పాట్లపై నగర పంచాయతీ కమిషనర్ ఇతర అధికారులతో చర్చించారు. సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వసతులు కల్పించాలని సూచించారు.
ఇవీ చదవండి: అభ్యర్థుల ఖరారు.. ఊపందుకున్న పుర ప్రచారం