సమాజంలో దిగజారిపోతున్న మానవతా విలువలకు కరోనా తోడు కావడంతో.. అవి కాస్తా పూర్తిగా పతనమయ్యాయి అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామ సచివాలయ కార్యదర్శి జయశంకర్ ఇందులో బాధితుడు. కరోనా లక్షణాలతో బాధపడుతూ, పింఛన్లు పంపిణీ చేసేందుకు వచ్చి అస్వస్థతకు గురైన ఆయనను.. చుట్టూ ఉన్న ఇరవై మంది సహోద్యోగులు సైతం పట్టించుకోలేదు. తోడుగా వచ్చిన ఆయన కుమారుడు.. సాయం చేయాలని అభ్యర్థించినా ఎవరూ స్పందించలేదు. పరిస్థితి క్షీణిస్తుండటంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసినా రాలేదు. ఓ ప్రభుత్వ ఉద్యోగికే ఇలాంటి స్థితి ఎదురైతే.. ఇక సామాన్యుల సంగతి ఏమిటోనని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాజేశ్ సహాయ్.. ఓ 'డాక్టర్' పోలీస్
నాలుగు రోజులుగా జ్వరంతో పాటు ఇతర కొవిడ్ లక్షణాలతో జయశంకర్ బాధపడుతున్నట్లు ఆయన కుమారుడు తెలిపారు. పింఛన్ల పంపిణీ నిలిచిపోతే గ్రామంలోని లబ్ధిదారులు ఇబ్బందులు పడతారని భావించి.. సాధ్యమైనంత త్వరగా తిరిగి వచ్చేస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అసలే ఆరోగ్యం సరిగా లేని వ్యక్తిని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక తాను తోడుగా వచ్చానని పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో.. చుట్టూ ఉన్న వారిని సాయం చేయాలని అభ్యర్థించినా సరిగా స్పందించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఫోన్ చేసినా అంబులెన్స్ సైతం రాకపోవడంతో మరణించారన్నారు. మృతదేహాన్ని తరలిండానికి ఎవరూ సహకరించకపోగా.. చివరకు రాజమహేంద్రవరానికి చెందిన భరత్ రాఘవ అనే వ్యక్తి ఏమీ ఆశించకుండా తన సొంత వాహనంలో తీసుకెళ్లాడని చెప్పారు. ఇస్కాన్ వద్దనున్న కైలాసభూమిలో అంత్యక్రియలు నిర్వహించినట్లు వెల్లడించారు. విధులకు హాజరు కాకముందే తన తండ్రి కరోనా పరీక్ష చేయించుకున్నారని.. ఆయన మరణం తర్వాత ఫలితం పాజిటివ్ గా వచ్చిందని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: