తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో ముంపునకు గురైన పొలాలను భాజపా అమలాపురం లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడు అయ్యాజి వేమ, భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం పరిశీలించారు.
రైతు పక్షపాతని చెప్పి..
తాము రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమానికి, అభివృద్ధికి చేసిందేమీ లేదని భాజపా నేతలు విమర్శించారు. ఓ పక్క కరోనా, మరో పక్క వాయుగుండం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయ్యాజి వేమ ఆవేదన చెందారు. అధిక వర్షాలు, వరదలతో పంట నష్టం జరిగి రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారన్నారు. నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత వరదల్లో నష్టపోయిన రైతులకు రూ. 6 కోట్లను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విడుదల చేశారని గుర్తు చేశారు.
ఇప్పటికీ జమ కాలేదు..
ప్రస్తుతం ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదని భాజపా నేతలు మండిపడ్డారు. అరటి, బత్తాయి , కూరగాయల తోటలు పండించిన రైతులు తీవ్ర స్థాయిలో నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా అరటికి రూ. 25,000, కందకి రూ. 30,000 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుల ఖాతాల్లో జమ చేయాలి..
గతంలో విడుదల చేసిన రూ. 6 కోట్లు, ఇప్పుడు ఇవ్వబోయే పరిహారంతో కలిపి తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. తక్షణమే రైతుల ఖాతాల్లో బకాయిలు జమ చేయాలని ప్రభుత్వాన్ని అయ్యాజి వేమ డిమాండ్ చేశారు.