CPI NATIONAL GENERAL SECRETARY RAJA FIRES ON YSRCP : ప్రత్యేక హోదా సాధన కోసం భాజపాతో పోరాటం చేతకాని సీఎం జగన్మోహన్రెడ్డి.. అమరావతి రైతులపై మాత్రం యుద్ధం చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కొండ గుంటూరులో రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. నిన్న రైతులపై వైకాపా నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి కేసులు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీగా తమ సంపూర్ణ మద్దతు ఒకే రాజధాని అమరావతికేనని రాజా స్పష్టం చేశారు.
అమరావతి కోసం పోరాటం సాగిస్తున్న రైతులకు సీపీఐ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. జగన్ కూడా గతంలో అంగీకరించారు. కానీ ఇప్పుడు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. పాదయాత్రపై కొందరు గూండాలు దాడి చేశారు. దీనిపై పోలీసులు తీసుకున్న చర్యలేంటి..? ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది..?-డి. రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి
వాళ్ల విషయంలో సీబీఐ మెతక వైఖరి: చంద్రబాబు-పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని సీపీఐ స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఐక్యపోరాటంలో భాజపా తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దుర్మార్గపు పాలన అంతమొందించేందుకు ఖచ్చితంగా ఐక్యపోరాటం అవసరమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం, కేంద్రంలో భాజపా-వైకాపా కలిసి ఐక్యంగా ఉన్నాయని రామకృష్ణ విమర్శించారు. పార్లమెంటరీ కమిటీల్లో మరే ఎంపీకి లేని పదవులు విజయసాయిరెడ్డికే ఎందుకు ఉన్నాయో కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భాజపా-వైకాపా ఐక్యత వల్లే సీబీఐ మెతక వైఖరితో ఉందని విమర్శించారు. ఇవన్నీ తెలిసే పవన్‌కల్యాణ్ తన అసంతృప్తి బయటపెట్టారని అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి: