తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద భారీగా నగదు, బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు బస్సులో తరలిస్తున్న 10 కిలోల 100 గ్రాముల బంగారు నగలు, రూ.5 కోట్ల 6 లక్షల నగదు పట్టుకున్నారు. విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లాకు పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో వేర్వురుగా బంగారం, నగదును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉగాది సందర్భంగా ఉత్తరాంధ్రలో బంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. బంగారం కొనుగోళ్ల దృష్ట్యా వ్యాపారులు నగలు తరలిస్తున్నట్లు సమాచారం. పలాస, టెక్కలి, నరసన్నపేటలోని బంగారు దుకాణాలకు నగదు, బంగారం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సొత్తుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవటంతో సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోనూ.. భారీగా నగదు పట్టుబడింది. నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టిన పోలీసులు.. రూ.4కోట్లకు పైగా నగదును పట్టుకున్నారు. బస్సు సీట్ల కింద లగేజ్ క్యారియర్‌లో భారీగా నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో బస్సు డ్రైవర్, క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బస్సులో తరలిస్తున్న నగదును పోలీసులు లెక్కించగా రూ.4.76కోట్లు ఉన్నట్లు తేల్చారు. దీంతోపాటు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో డ్రైవర్, క్లీనర్‌తోపాటు మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 4.75 కోట్ల డబ్బు.. 350గ్రాముల బంగారం తరలిస్తుండగా..