చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పలు గిరిజన తండాలలో గిరిజనులు సమస్యలతో సతమతమవుతున్నారు. తంబళ్లపల్లి, పెద్దమండ్యం, మొలకలచెరువు మండలాల్లో 32 గిరిజన తండాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని తండాల్లో కనీస సౌకర్యాలు లేవు.
మూడేళ్లయినా పూర్తికాని రోడ్డు నిర్మాణం
పెద్దమండ్యం మండలం అవికే నాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిది తండాలను కలుపుతూ చేపట్టిన తారు రోడ్డు నిర్మాణ పనులు 3 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్నాయి. నాబార్డు నిధులతో 6 కిలో మీటర్లకు పైగా తారు రోడ్డు నిర్మాణాన్ని తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు.
నది దాటలేక నానాఅవస్థలు
పెద్దేరు నదిపై నిర్మించాల్సిన మోరీ ప్రారంభ దశలోనే ఉంది. వర్షాకాలం ప్రారంభం కావటంతో పెద్దేరు దాటలేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మించకపోవడంతో ఏడు కిలోమీటర్ల దూరం కంకర పైనే రాకపోకలు కొనసాగిస్తూ అవస్థలు పడుతున్నారు.
తాగునీటికీ సమస్యే...
బండెమ్మ దిగువపల్లి గ్రామపంచాయతీ దేవలం తండాలో గిరిజనులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలో మీటరుకు పైగా దూరం నుంచి తాగునీటిని మోసుకొస్తున్నామని మహిళలు తెలిపారు. శాశ్వత తాగునీటి పథకం మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.
భవనం లేని అంగన్వాడీ కేంద్రం
అవికే నాయక్ తండా అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం నిర్మించాలని, తండాలలో మురుగునీటి కాలువలు, సిమెంటు రోడ్లు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: మా పార్టీలోనూ వెన్నుపోటుదారులు ఉన్నారు: అంబటి రాంబాబు