పెంచిన విద్యుత్ బిల్లులను తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ... చిత్తూరు జిల్లా మదనపల్లిలో తెదేపా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రమేశ్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ ప్రకటించిన మూడు నెలల కాలానికి విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని రమేశ్ డిమాండ్ చేశారు. అలాగే పాత విద్యుత్ శ్లాబ్‌ను అమలు చేయాలన్నారు.
తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు పుత్తూరులో స్థానిక తెదేపా నాయకులు విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడం దారుణమని నేతలు వ్యాఖ్యానించారు.
లాక్ డౌన్ వేళ ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. విద్యుత్ చార్జీలను నాలుగు రెట్లు పెంచడాన్ని నిరసిస్తూ.. చంద్రగిరి తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. పార్టీ కార్యాలయంలో మండల తెదేపా నాయకుడు గంగపల్లి భాస్కర్ అధ్యక్షతన నిరసదీక్ష నిర్వహించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలతో పాటు మద్యం ధరలను పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తోందని నాయకులు మండిపడ్డారు.