చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం ఓళ్లూరు గ్రామానికి చెందిన నాగార్జున, మునికుమారి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండో కుమార్తె దీక్షిత (10) కు పుట్టుకతోనే మానసిక, శారీరక వైకల్యం ఉంది. మూడో కుమార్తె తేజస్విని (4) జన్మించిన ఏడాది తర్వాత గుండె వ్యాధి బయట పడింది. అప్పటి నుంచి సుమారు మూడు లక్షలతో వైద్యం అందించి.. రెండో ఏడాది గుండె ఆపరేషన్ చేయించారు.
ప్రస్తుతం మేజర్ ఆపరేషన్ చేయించాలని చెన్నై మియోట్ ఇంటర్నేషనల్ ఆసుపత్రికి చెందిన వైద్యులు సూచించారు. అందుకు 5 లక్షలు ఖర్చు కానుంది. ఇప్పటికే వికలాంగురాలైన మొదటి ఆడబిడ్డకి, రెండో బిడ్డ గుండె చికిత్స వైద్యానికి తల్లిదండ్రులు ఉన్న ఆస్తి పొలాన్ని ఆసుపత్రికి ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే నాగార్జున ఆటో నడిపి, ముని కుమారి కూలి పనికి వెళ్లి ఆ పూటకి కడుపు నింపుకుంటున్నారు.
ఈ తరుణంలో తన బిడ్డ ప్రాణాలు ప్రభుత్వం, దాతలే కాపాడాలని ఆ పేద దంపతులు కోరుతున్నారు. ఈ నెల పూర్తయ్యేలోపు రెండో చిన్నారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు తేల్చారు. తమ బిడ్డల ప్రాణం.. ప్రభుత్వం, దాతల చేతుల్లోనే ఉందని, ప్రాణభిక్ష పెట్టాలని తిరుపతి ప్రెస్ క్లబ్ ఎదుట వారు వేడుకున్నారు.
ఇదీ చదవండి:
పోలీసు వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సీఎం చర్యలు: మంత్రి కన్నబాబు