చిత్తూరు జిల్లా గంగవరం మండలం గండ్రజుపల్లె చెక్పోస్ట్ వద్ద భారీగా మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పర్యవేక్షణ అధికారి రిశాంత్ రెడ్డి వివరాలు తెలియజేశారు.
సీఐ రామకృష్ణచారి ఆధ్వర్యంలో బెంగళూరు-చెన్నై జాతీయ రహదారిపై గండ్రజుపల్లె చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 10 చక్రాల లారీలో పెద్ద ఎత్తున పొట్టు బయటకు రావడం గమనించి తనీఖీ చేయగా.. భారీగా మద్యం సీసాలు బయటపడ్డాయి. వాటి విలువ సుమారు. రూ. 13లక్షల 55 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాటిని కర్ణాటక నుంచి నెల్లూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో లారీ క్లీనర్ కరీముల్లా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని.. వారికోసం గాలిస్తున్నట్లు వివరించారు.
మూడు నెలలుగా దాదాపు రూ. 88 లక్షల విలువైన మద్యం... రూ. 20 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు రిశాంత్ రెడ్డి చెప్పారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి మద్యం అక్రమ రవాణా చేస్తే వారిపై పీడీ యాక్ట్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..