Harish Rao asked the center for booster doses: రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బూస్టర్ డోస్‌ల పంపిణీకి సరిపడా టీకాలు సరఫరా చేయాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. కరోనా పరిస్థితులు, రాష్ట్రాల సన్నద్ధతపై కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మనసుక్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగిన వీడియో సమీక్షలో మంత్రి హరీశ్ రావు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవ్యాక్సిన్ 8 లక్షలు, కొవిషీల్డ్ 80 వేలు ఉండగా.. కోర్బివాక్స్ డోసులు లేవని సమీక్షలో ప్రకటించారు.
రాష్ట్రంలో బూస్టర్ డోసు వేగవంతం చేసేందుకు గానూ అవసరమైన వ్యాక్సిన్‌లను రాష్ట్రానికి సరఫరా చేయాలని హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బూస్టర్ డోసు పంపిణీలో జాతీయ సగటు 23 శాతం ఉంటే.. తెలంగాణ 48 శాతంగా ఉందని వివరించారు. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్-7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స వంటి అంశాల గురించి రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించారు.
గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పీఎస్ఏ ప్లాంట్స్ మరమ్మతులు జరగటం లేదని.. వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
ఇవీ చదవండి: